రిటైర్ అయినా కౌంటీలు ఆడుతూ సెంచరీలు బాదుతున్న అలెస్టర్ కుక్... ఈ బుద్ధి మనవాళ్లకు ఉండి ఉంటేనా...

Published : Jun 12, 2023, 04:53 PM IST
రిటైర్ అయినా కౌంటీలు ఆడుతూ సెంచరీలు బాదుతున్న అలెస్టర్ కుక్... ఈ బుద్ధి మనవాళ్లకు ఉండి ఉంటేనా...

సారాంశం

ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్... కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 74వ ఫస్ట్ క్లాస్ సెంచరీ చేసిన కుక్.. 

ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో రంజీల్లో ఆడతారా? అనే ప్రశ్నకు, ‘నన్ను టెస్టు టీమ్‌లోకి తీసుకోరు? ఇక దేశవాళీ టోర్నీల్లో ఆడి ఏం లాభం?’ అని సమాధానం చెప్పాడు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్. ధావన్ ఒక్కడే కాదు, ప్రస్తుతం టీమిండియా తరుపున ఆడుతున్న చాలామంది క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు ఆడేందుకు ఇష్టపడడం లేదు..

మూడేళ్ల పాటు ఫామ్‌ కోల్పోయి పడరాని కష్టాలన్నీ పడిన విరాట్ కోహ్లీ, నెల రోజుల పాటు బ్రేక్ తీసుకున్నాడు కానీ మాజీ క్రికెటర్లు ఎందరు చెప్పినా దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు ఇష్టపడలేదు. కారణం టీమిండియాకి ఆడిన తర్వాత తాము స్టార్లం అయిపోయాం, దేశవాళీ టోర్నీలు ఆడేవాళ్లంతా సాధారణ క్రికెటర్లు అనే ఫీలింగే...

రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే వంటి క్రికెటర్లు, టీమిండియా షెడ్యూల్ బ్రేక్‌లో దేశవాళీ టోర్నీల్లో ఆడేవాళ్లు. వసీం జాఫర్ అయితే దేశవాళీ టోర్నీల్లో లెజెండరీ ప్లేయర్‌గా ఎదిగాడు. అయితే నేటి తరం క్రికెటర్లు, భారత జట్టులోకి వచ్చిన తర్వాత దేశవాళీ టోర్నీలు ఆడడాన్ని నామోషీగా ఫీల్ అవుతున్నారు. 

టీమిండియా సెలక్టర్లు కూడా ఐపీఎల్ ప్రదర్శనకి ఇచ్చిన విలువ, దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్‌లకు ఇవ్వడం లేదు. అందుకే రంజీల్లో రికార్డు లెవెల్లో పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్, టీమిండియా నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా? అని ఏళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు... 

అయితే విదేశాల్లో ఆ పరిస్థితి లేదు. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన అలెస్టర్ కుక్, తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సెంచరీ చేసి, ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 74వ సెంచరీ నమోదు చేశాడు. 

జో రూట్, బెన్ స్టోక్స్ వచ్చాక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ గురించి చాలా మంది మరిచిపోయారు. 161 టెస్టులు ఆడిన అలెస్టర్ కుక్, ఇంగ్లాండ్ తరుపున టెస్టుల్లో రికార్డులు బ్రేక్ చేశారు. టెస్టుల్లో అతి చిన్న వయసులో 12 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్న అలెస్టర్ కుక్, సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 10 వేల పరుగులు చేసిన ఓపెనర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు..

59 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన అలెస్టర్ కుక్, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అలెస్టర్ కుక్, ఇంకా కౌంటీల్లో ఆడుతున్నాడంటే నమ్మడం కష్టమే...

38 ఏళ్ల అలెస్టర్ కుక్, 2003 నుంచి ఎసెక్స్ క్లబ్ తరుపునే ఆడుతున్నాడు. తాజాగా కౌంటీ ఛాంపియన్‌షిప్ 2023లో భాగంగా సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 244 బంతుల్లో 19 ఫోర్లతో 128 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సర్ అలెస్టర్ కుక్.. 

చాలామంది భారత క్రికెటర్లు, టీమిండియాలోకి రావడానికి దేశవాళీ టోర్నీలు, రంజీ ట్రోఫీలు ఆడతారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఐదేళ్ల తర్వాత కూడా ఆట మీద ఇష్టంతో ఇంకా కౌంటీల్లో ఆడుతున్నాడు అలెస్టర్ కుక్...

ఇదే బుద్ధి మనవాళ్లకు ఉండి ఉంటే, ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ప్రదర్శన ఇంత దారుణంగా ఉండేది కాదని వాపోతున్నారు టీమిండియా ఫ్యాన్స్. 
 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే