బుమ్రా ఒక్కడితో అంతా సెట్ అవుద్దా..? ఈ బౌలింగ్‌తో టీ20 ప్రపంచకప్‌లో నెగ్గగలమా..?

By Srinivas MFirst Published Sep 21, 2022, 2:43 PM IST
Highlights

Jasprit Bumrah: ఆసియాకప్ లో   ఫైనల్ చేరకుండానే ఇంటిబాట పట్టిన భారత జట్టు.. మంగళవారం ఆసీస్ తో మొహాలీలో జరిగిన తొలి టీ20లో కూడా దారుణంగా ఓడింది. భారత వరుస వైఫల్యాలకు కారణమెవరు.? అన్న ప్రశ్నకు అందరినోటా వినిపిస్తన్న సమాధానం ఒక్కటే.. 
 

కొద్దిరోజల క్రితం ముగిసిన ఆసియా కప్ లో గ్రూప్ దశలో పాకిస్తాన్ ను ఓడించిన భారత్.. సూపర్-4లో మరోసారి తలపడింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 181 పరుగుల భారీ స్కోరు చేసింది.  కానీ ఆ మ్యాచ్ లో పాక్ దే విజయం. అదే సూపర్-4లో  తర్వాత శ్రీలంకతో మ్యాచ్ లో  తొలుత బ్యాటింగ్ చేసి 174 పరుగుల లక్ష్యాన్ని లంక ముందుంచింది. ఫలితం మాత్రం మారలేదు.  కట్ చేస్తే.. మంగళవారం మొహాలీలో  ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో  మొదట బ్యాటింగ్ చేసి  ఏకంగా 208 పరుగులు  సాధించింది. కానీ ఫలితం మాత్రం రిపీట్ అయింది. భారత్ మళ్లీ ఓడింది. ఈ మూడు మ్యాచుల్లో భారత్ ఓడటానికి ప్రధాన కారణం ఒక్కటే.. బౌలింగ్.  

గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కొత్త సారథి రోహిత్ శర్మ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో దుమ్ము రేపిన టీమిండియా.. గత కొంతకాలంగా మాత్రం లయ తప్పింది. కీలక బౌలర్లైన జస్ప్రీత్ బుమ్రా గాయాల పాలవడం.. మహ్మద్ షమీని టీ20లలోకి ఎంపిక చేయకపోవడంతో  పాటు వెటరన్ పేసర్ భువనేశ్వర్ ఆసియా కప్ నుంచి గాడి తప్పుతున్నాడు. 

లయ తప్పుతున్న భువీ... 

బుమ్రా, షమీల గైర్హజరీలో భువనేశ్వర్ దారుణంగా విఫలమవుతున్నాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడమే గాక  వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచే భువీలో ఆ లయ తప్పింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భువీ.. 4 ఓవర్లలో 52 పరుగులిచ్చాడు. అంతేగాక గత నాలుగు మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ.. 4 ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.  ఆసియా కప్ లో కూడా భువీ కీలక మ్యాచ్ లలో చేతులెత్తేశాడు. 

కుదురుకోని హర్షల్.. 

ఆసియా కప్ కు ముందు గాయంతో వైదొలిగిన హర్షల్ పటేల్.. ఇంకా పూర్తి స్థాయిలో కుదురుకోలేదు. గాయం నుంచి కోలుకున్నాడని చెప్పి ఫిట్నెస్ టెస్టు కూడా పాసై ఆస్ట్రేలియా సిరీస్ లో బీసీసీఐ హర్షల్ ను ఆడిస్తున్నది.  కానీ మొహాలీలో హర్షల్ బౌలింగ్ లో మ్యాజిక్ కనిపించలేదు. స్లో డెలివరీలతో దిగ్గజ బ్యాటర్లను బోల్తా కొట్టించే హర్షల్.. నిన్నటి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చాడు. 

షమీ.. టీ20లకు పనికిరాడట.. 

గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత టీ20 జట్టులో షమీ చోటు దక్కించుకోలేదు.  అసలు షమీని ఈ ఫార్మాట్ కు అనువైన బౌలర్ గా పరిగణించడం లేదని బీసీసీఐ అధికారి ఓ సందర్భంలో తెలిపాడు. కానీ ఆసియా కప్ లో ఫలితాలు చూశాక గానీ సెలక్టర్లకు జ్ఞానోదయం కలగలేదు. ఆసీస్ తో సిరీస్ కు షమీని ఎంపిక చేశారు. టీ20 ప్రపంచకప్ కు 15 మంది సభ్యులలో లేకున్నా స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికయ్యాడు. 

బుమ్రా అన్ ఫిట్..?

భారత బౌలింగ్ వైఫల్యంపై వస్తున్న  విమర్శలకు  టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ నుంచి వినిపిస్తున్న సమాధానం ఒక్కటే.  ‘టీమిండియా పేస్ గుర్రం బుమ్రా వచ్చాక బౌలింగ్ దళం బలం పుంజుకుంటుంది’ అని.. మరి అందులో నిజమెంత..?  అసలు బుమ్రా వచ్చాక బౌలింగ్ బలం గురించి పక్కనబెడితే  ఇప్పటికీ అతడింకా పూర్తిగా కోలుకోలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో హడావిడిగా అతడికి ఫిట్నెస్ పరీక్ష చేయించి పాస్ చేయించిన బీసీసీఐ.. బుమ్రాను ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు కూడా ఎంపిక చేసింది. కానీ ఆసీస్ తో తొలి టీ20కి మాత్రం బుమ్రా బరిలోకి దిగలేదు. కారణమేంటో కెప్టెన్ చెప్పకున్నా అతడింకా ఫిట్ గా లేడని అర్థమవుతూనే ఉంది.  హార్ధిక్ పాండ్యా కూడా మ్యాచ్ ముగిశాక అదే మాట చెప్పడం గమనార్హం. ఆసియా కప్ కు ముందు బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతుండగా అతడు కోలుకోవడానికి కనీసం రెండు నెలలైనా పట్టొచ్చని  వైద్యులు తేల్చారు. కానీ బీసీసీఐ మాత్రం ఆఘమేఘాల మీద అతడిని ఎంపిక చేసి అబాసుపాలవుతున్నది.  

ఇక టీ20 ప్రపంచకప్ కు ఎంపికైన అర్ష్‌దీప్ సింగ్  భువీ, హర్షల్ కంటే కాస్త బెటర్ గా కనిపిస్తన్నాడు.  వికెట్లేమీ తీయకపోయినా డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ ఫర్వాలేదనిపించాడు. కానీ అతడిని ఆసీస్ తో సిరీస్ కు ఎంపిక చేయకపోవడం గమనార్హం.

మరి వీళ్లతో ప్రపంచకప్ లో ఎలా..? 

ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు అంతకుముందు ముగిసిన ఆసియా కప్ లలో ఓటములు పెద్దగా లెక్కలో తీసుకోకున్నా  వచ్చే నెల జరుగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత బౌలర్లు ఇలా చతికిలపడుతుండటం  ఆందోళనకు గురిచేసేదే. ఆ క్రమంలోనే ఈ బౌలింగ్ తో టీ20 ప్రపంచకప్ నెగ్గగలమా..? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.  అయితే ఇక్కడితో పోల్చితే ఆసీస్ పిచ్ లు బౌలింగ్ కు అనుకూలిస్తాయి. ప్రపంచకప్ కు ఇంకా దాదాపు నెల రోజులు (భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 23న) సమయముంది. ఈలోపు భారత్ బౌలింగ్ వైఫల్యాలపై సమీక్ష చేసుకుని   లోపాలు సరిదిద్దుకోకుంటే మాత్రం దుబాయ్ లో గతేడాది సీన్ రిపీట్ కాక తప్పదు.  

click me!