WI vs IND: శ్రేయాస్ అయ్యర్ సూపర్.. పాండ్యా ఫినిషింగ్ టచ్.. విండీస్ ముందు భారీ టార్గెట్

By Srinivas MFirst Published Aug 7, 2022, 10:01 PM IST
Highlights

WI vs IND T20I: వెస్టిండీస్‌తో ఇప్పటికే  వన్డేతో పాటు టీ20 సిరీస్ కూడా నెగ్గిన భారత జట్టు నామమాత్రపు మ్యాచ్ లో కూడా చెలరేగి ఆడింది. ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో హార్ధిక్ పాండ్యా సారథిగా ఉన్నాడు. 

నామమాత్రపు మ్యాచ్ అయినా భారత బ్యాటర్లు బాదుడు ఆపలేదు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కు రెస్ట్ ఇవ్వడంతో  కీలక ఆటగాళ్లను కోల్పోయినా ఫోర్లు, సిక్సర్లకు ఏమాత్రం లోటు రాలేదు.  శ్రేయాస్ అయ్యర్ (40 బంతుల్లో 64, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38, 3 ఫోర్లు,  2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (16 బంతుల్లో 28, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు చెలరేగడంతో వెస్టిండీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188  పరుగులు చేసింది.

రోహిత్ కు రెస్ట్ ఇవ్వడంతో   భారత జట్టుకు హార్ధిక్ పాండ్యా సారథిగా వ్వవహరించాడు. సూర్య స్థానంలో ఇషాన్ కిషన్ కు అవకాశం వచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టుకు  ఇషాన్ కిషన్ (11), శ్రేయాస్ అయ్యర్ లు మంచి  ఆరంభాన్నే ఇచ్చారు. ఇషాన్ ఇబ్బందిపడ్డా అయ్యర్ చెలరేగి ఆడాడు. హోల్డర్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్ తో ఖాతా తెరిచిన అయ్యర్.. ఆ  తర్వాత డ్రేక్స్ వేసిన  మూడో ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. 

డ్రేక్స్ వేసిన ఐదో ఓవర్లో ఇషాన్.. విండీస్ సారథి పూరన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి వికెట్ కు ఈ ఇద్దరూ  38 పరుగులు జోడించారు. ఇషాన్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, అయ్యర్ తో జతకలిశాడు. ఇద్దరూ కలిసి ధాటిగా ఆడారు. కీమో పాల్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన హుడా తన ఉద్దేశాన్ని చాటాడు. ఇక ఒడియన్ స్మిత్ వేసిన  8వ ఓవర్లో  అయ్యర్ రెండు సిక్సర్లు బాది హాఫ్  సెంచరీకి దగ్గరయ్యాడు.  పావెల్ వేసిన పదో ఓవర్లో చివరి బంతిని బౌండరీకి తరలించి  30 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. 

హాఫ్  సెంచరీ తర్వాత ఈ ఇద్దరూ మెక్ కామ్ వేసిన  11వ ఓవర్లో 4, 6, 4 తో చెలరేగారు. ఆ ఓవర్లోనే భారత స్కోరు వంద దాటింది. కానీ హెడెన్ వాల్ష్ వేసిన 12వ ఓవర్లో నాలుగో బంతికి హుడా.. బ్రూక్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 76 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హుడా నిష్క్రమించిన మరుసటి ఓవర్లోనే అయ్యర్ కూడా హోల్డర్ వేసిన 13వ ఓవర్లో  అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

 

Shre-YASSS! 💪😎

6⃣4⃣(40) 👉 's gritty FIFTY has given 🇮🇳 a perfect start! 👏 pic.twitter.com/seQDmmcVNM

— Mumbai Indians (@mipaltan)

ఆ తర్వాత సంజూ శాంసన్ - హార్ధిక్ పాండ్యాలు జతకలిశారు. హెడెన్ వాల్ష్ బౌలింగ్ లో తలో ఫోర్ కొట్టిన ఈ జంటను స్మిత్ విడదీశాడు. శాంసన్ (15) ను స్మిత్ బౌల్డ్ చేశాడు. దినేశ్ కార్తీక్ (12).. రెండు ఫోర్లు కొట్టినా త్వరగానే నిష్క్రమించాడు. కానీ పాండ్యా.. 19వ ఓవర్లో 19 పరుగులు రాబట్టాడంతో భారత్ 180 పరుగుల మార్కును చేరింది.
 

click me!