
చిన్నప్పుడు క్రికెట్ బ్యాటు పట్టిన ప్రతీ పిల్లాడు, టీమిండియా తరుపున ఆడాలని కలలు కంటాడు. అండర్16, అండర్19, రంజీ ట్రోఫీ... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగే క్రికెటర్ల అంతిమ లక్ష్యం కూడా టీమిండియాకి ఆడడమే...
అయితే 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో టీమిండియా తుది జట్టులో ఆడేందుకు కావాల్సింది 11 మంది మాత్రమే. ది బెస్ట్ ప్లేయర్లు వీరేనంటూ సెలక్టర్లు ఏరి కోరి ఎన్నో అంచనాలు వేసి సెలక్ట్ చేస్తున్న జట్లు, ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి..
దీనికి ప్రధాన కారణం దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న వారికి టీమిండియాలో చోటు దక్కకపోవడమే. దేశ, విదేశీ క్రికెటర్లు కలగలిసి కొట్టుకునే ఐపీఎల్‌ని, ఐపీఎల్ ఆటను బేస్ చేసుకుని మాత్రమే ప్లేయర్లను సెలక్ట్ చేస్తున్నారు సెలక్టర్లు...
ఆడేది టీమిండియాకి అయినా, ఆడించేది మాత్రం ఫ్రాంఛైజీలేనని తేలిపోయింది. టీ20, వన్డేల్లో ఐపీఎల్ డామినేషన్ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నా, టెస్టు టీమ్ ఎంపికలో కూడా ఫ్రాంఛైజీలే పావులు కదుపుతుండడం... ట్రూ క్రికెట్ ఫ్యాన్స్‌ని భయపెడుతోంది...
రంజీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్, టీమిండియా నుంచి పిలుపు దక్కకపోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సునీల్ గవాస్కర్ అయితే రంజీ పర్ఫామెన్స్‌లను ప్రామాణీకంగా తీసుకోనప్పుడు, రంజీ ట్రోఫీని నిర్వహించడమే ఆపేయాలంటూ ఘాటుగా స్పందించాడు..
అయితే దేశవాళీ టోర్నీల్లో రికార్డులు కొడుతున్న ప్లేయర్లను పట్టించుకోకపోవడం ఇప్పుడేమీ కొత్త కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరొందిన ఎందరో టీమిండియాలో చోటు దక్కించుకోకుండానే రిటైర్ అయ్యారు. ఆల్‌రౌండర్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6 వేలకు పైగా పరుగులు, 300లకు పైగా వికెట్లు తీసిన జలజ్ సక్సెనా.. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టీమిండియా నుంచి పిలుపు దక్కించుకోలేకపోయాడు..
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన జలజ్ సక్సెనా, 119 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 6256 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే స్పిన్నర్‌గా 326 వికెట్లు తీశాడు. ఇందులో 19 సార్లు ఐదేసి వికెట్లు, 5 సార్లు పదేసి వికెట్లు పడగొట్టాడు..
లిస్టు ఏ క్రికెట్‌లో 93 మ్యాచులు ఆడి 1884 పరుగులు చేసిన జలజ్ సక్సేనా, 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు సాధించాడు. బౌలింగ్‌లో 108 వికెట్లు తీశాడు.
కెరీర్ ఆరంభంలో మధ్యప్రదేశ్‌కి ఆడిన జలజ్ సక్సేనా, 2016-17 సీజన్ నుంచి కేరళ రాష్ట్రానికి ఆడుతున్నాడు. 2017-18 సీజన్‌లో 44 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన జలజ్ సక్సేనా, కేరళ తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. అయితే ఇలాంటి పర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత కూడా సెలక్టర్లు, జలజ్ సక్సేనాను పట్టించుకోలేదు..
2018-19 సీజన్‌లో 551 పరుగులు చేసిన జలజ్ సక్సేనా, రెండు సార్లు ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి 8 వికెట్లు తీసిన భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇండియా A, ఇండియా C టీమ్స్ తరుపున ఆడిన జలజ్ సక్సేనా, 2019-20 దియోదర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు..
జలజ్ సక్సేనాని సెలక్టర్లు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అతనికి ఐపీఎల్‌లో అవకాశాలు రాకపోవడమే. ఐపీఎల్‌లో 2013 నుంచి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ టీమ్స్‌కి మారిన జలజ్ సక్సేనా, 2021లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన జలజ్ సక్సేనా, వికెట్ తీయలేకపోయాడు. అతనికి మళ్లీ అవకాశం దక్కలేదు..
ప్రస్తుతం జలజ్ సక్సేనా వయసు 36 ఏళ్లు. ఈ వయసులో ఇక అతనికి టీమిండియాలో చోటు దక్కదు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇదే విధంగా బీసీసీఐ రాజకీయాలకు బలికాక తప్పదేమో. ఆల్‌రౌండర్‌గా అదరగొట్టినా పట్టించుకోని సెలక్టర్లు, లావుగా ఉన్న బ్యాటర్‌ని ఎలా పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్..