
భారత క్రికెట్ జట్టులో టాప్-5 క్రికెటర్లలో ఒకడిగా ఉన్న కెఎల్ రాహుల్ టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకడు. భారత జట్టుతో పాటు ఐపీఎల్ లో పరుగుల వరద పారించే కెఎల్.. ఎంత చదువుకున్నాడో తెలుసా.. అతడి ఇంటర్వ్యూలు చూసినా రాహుల్ మాట్లాడే స్టైల్, అతడి అటిట్యూడ్ చూసినా ఈ లక్నో సారథి ఏదో పెద్ద చదువులు చదివాడనే అనిపిస్తుంది. కానీ మనోడు చదివింది డిగ్రీయే. అదైనా పాస్ అయ్యాడంటే అదీ లేదు. క్రికెట్ మీద మోజులో పడి చదువును అటకెక్కించిన రాహుల్ ను.. డిగ్రీ పాస్ అవమని వాళ్ల అమ్మ ఒకటే పోరు పెడుతుందట. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న అతడిని పట్టుకుని.. డిగ్రీ కంప్లీట్ చేయమని గోల చేసిందట.. ఈ విషయాన్ని కెఎలే స్వయంగా వెల్లడించాడు.
ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ నిర్వహించే ‘బ్రేక్ ఫాప్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో రాహుల్ క్రికెట్ లోకి అడుగుపెట్టక ముందు తన జీవితం, ఆ పైన క్రికెట్ కెరీర్, కుటుంబం, తన పేరు వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
మా అమ్మ పోరు భరించలేను..
రాహుల్ మాట్లాడుతూ... ‘మా ఇంట్లో అందరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థానాల్లో ఉన్నవారే. మా నాన్న ఫ్రొఫెసర్. మా అమ్మ ప్రొఫెసర్. మా ఫ్యామిలీలో ఎవరి గురించి చెప్పాల్సి వచ్చినా వారి వెనుక ఏదో పెద్ద డిగ్రీతో పాటు మంచి ఉద్యోగం కూడా ఉంది. కానీ మనకేమో అలా కాదు. చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే పిచ్చి. పదో తరగతి తర్వాత నేను సైన్స్, మేథ్స్ కాకుండా కామర్స్ తీసుకున్నా.
అది తెలియగానే మా ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు. కామర్స్ ఏంటి..? మన ఇంటా వంటా ఉందా..? అన్నట్టు మాట్లాడారు. కానీ నేను మాత్రం.. ఈ సైన్స్, మేథ్స్ నా వల్ల కాదు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. కామర్స్ అయితేనే చదువుతా అని తెగేసి చెప్పా. అయితే క్రికెట్ మీద ఆసక్తితో డిగ్రీ కంప్లీట్ చేయలేదు. తర్వాత నేను క్రికెటర్ గా బిజీ అయ్యాను. దాంతో నా చదువు అటకెక్కింది.
మా అమ్మ ఇప్పటికీ నన్ను డిగ్రీ కంప్లీట్ చేయమని పోరు పెట్టేది. లాక్ డౌన్ సమయంలో మ్యాచులేమీ లేక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి.. ఖాళీగా కూర్చోపోతే ఆ డిగ్రీ ఏదో పూర్తి చేయొచ్చుగా..? అని చెప్పేది...’ అని తెలిపాడు.
జాతీయ జట్టుకు ఆడినదానికంటే దానికే ఎక్కువ హ్యాపీ..
నేను టీమిండియా తరఫున క్రికెట్ ఆడినా మా అమ్మ పెద్దగా హ్యాపీగా ఉన్నట్టు అనిపించలేదు. కానీ నాకు స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం మా అమ్మ చాలా సంతోషంగా ఫీలయ్యింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు ఆమె నన్ను చాలా మెచ్చుకుంది... అని రాహుల్ చెప్పాడు. రాహుల్ కు ఆర్బీఐలో జాబ్ వచ్చినా అతడింకా తన డిగ్రీని కంప్లీట్ చేయకపోవడం విశేషం.
పేరు గురించి..
చిన్నప్పుడు నేను నా పేరును బాలీవుడ్ సినిమాలలో షారుక్ ఖాన్ నటించిన పలు సినిమాలలోని రాహుల్ క్యారెక్టర్ల నుంచి పెట్టారని అనుకున్నా. చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ తో కూడా ఇదే చెప్పేవాడిని. కానీ తర్వాత తెలిసిందేంటంటే.. 1994 తర్వాత షారుక్.. సినిమాలలో రాహుల్ క్యారెక్టర్ చేశాడు. నేనేమో 1992లోనే పుట్టాను. అయితే మా అమ్మ షారుక్ ఖాన్ కు చాలా పెద్ద అభిమాని.. అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇటువంటి ఆసక్తికర విషయాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు అతడి అభిమానులను అలరిస్తున్నది. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి..