అవును మనం ఎక్కడున్నాం..? బాసూ మనకు మెమోరీ లాస్ అంటున్న టీమిండియా యువ ఆల్‌రౌండర్

By Srinivas MFirst Published Dec 1, 2022, 12:13 PM IST
Highlights

టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ భారత జట్టుకు రవీంద్ర జడేజా లేని లోటును భర్తీ చేస్తున్నాడు. న్యూజిలాండ్  తో వన్డే సిరీస్ లో  బ్యాట్, బాల్ తో రాణించాడు. మూడో వన్డే ముగిసిన తర్వాత.. 
 

మిశ్రమ ఫలితాలు వెలువడిన న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాకు ఏదైనా మంచి జరిగిందా అంటే అది  వాషింగ్టన్ సుందర్  రూపంలో యువ ఆల్ రౌండర్ ఉన్నాడని గుర్తించడమే. వన్డే సిరీస్ లో వాషింగ్టన్   తన బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ స్కిల్స్ కూడా బయటకు తీశాడు.  తొలి, మూడు వన్డేలలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత్ పరువు కాపాడాడు. రవీంద్ర జడేజాలేని లోటును తీర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం  వాషింగ్టన్..  కామెంటేటర్ మురళీ కార్తీక్ తో  మాట్లాడుతూ.. తాను ఎక్కడున్నాననే విషయం మరిచిపోయాడు. 

మూడో వన్డే వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంంతో మురళీ కార్తీక్ తో  వాషింగ్టన్ మాట్లాడాడు. ఇంగ్లీష్ కౌంటీలలో ఆడటం తనకు  ఉపకరించిందా..? అని కార్తీక్ ప్రశ్నించాడు. దానికి  సుందర్ సమాధానం చెబుతూ.. ‘తప్పకుండా. లంకాషైర్, మాంచస్టర్ లలో ఆడటం నాకు కలిసొచ్చింది.  అక్కడ చలి బాగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎలా ఆడాలో నాకు అనుభవముంది.  అది ఇక్కడ కూడా ఉపయోగపడింది...

లంకాషైర్, మాంచెస్టర్ లలో మాదిరిగానే ఇక్కడ.. ఇక్కడ..’ అని ఆగి ‘అవును మనం ఎక్కడున్నాం..?’ అని కార్తీక్ ను అడిగాడు. అప్పుడు  కార్తీక్ క్రైస్ట్ చర్చ్ అని  ఆన్సర్ ఇచ్చాడు..‘హా, క్రైస్ట్ చర్చ్. ఆ అనుభవం నాకు ఇక్కడ కలిసొచ్చింది. అందుకే నేను  ఫ్రీగా బ్యాటింగ్ చేయగలిగా..’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బహుశా సుందర్ మెమోరీ లాస్ తో బాధపడుతున్నాడేమో అని ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

 

pic.twitter.com/OiYEywPao2

— Guess Karo (@KuchNahiUkhada)

మూడో వన్డేలో భారత్ 149-6 వద్ద ఉండగా క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్.. దీపక్ చాహర్ తో 21 పరుగులు, యుజ్వేంద్ర చాహల్ తో 31 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు.  సుందర్ హాఫ్ సెంచరీ కారణంగానే భారత్ నిన్నటి మ్యాచ్ లో కివీస్ ముందు 220 పరుగుల టార్గెట్ ను ఉంచగలగింది. 

ఇక మూడో వన్డే లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాస్త తెరిపినిచ్చిన వరుణుడు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అనుకోని అతిథిలా విచ్చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. 18 ఓవర్ల వద్ద ఉండగా వర్షం కురిసింది. ఆ సమయానికి కివీస్.. 1 వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది.  ఫిన్ అలెన్ (57) హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించినా.. డెవాన్ కాన్వే (38), కేన్ విలియమ్సన్ (0 నాటౌట్) లు క్రీజులో ఉండగా వర్షం అంతరాయం కలిగించింది.  దీంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన ఆటగాళ్లు మళ్లీ  ఫీల్డ్ లోకి రాలేదు. వాన కురవడం, ఆగడం  చేస్తుండటంతో పలుమార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్ ను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.  మ్యాచ్ రద్దు కావడంతో కివీస్ సిరీస్ ను  1-0తో చేజిక్కించుకుంది. 

click me!