డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వేధింపులపై పి.టి. ఉషకు లేఖ రాసిన రెజ్లర్లు.. స్పందించిన ఐఓఏ అధ్యక్షురాలు

By Srinivas MFirst Published Jan 20, 2023, 3:37 PM IST
Highlights

WFI: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ  దేశ స్టార్ రెజ్లర్లు  ఆందోళన  చేపట్టిన విషయం తెలిసిందే.  తాజాగా  వాళ్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షురాలికి లేఖ రాశారు. 

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్  బ్రిజ్ భూషన్ శరణ్  తో పాటు జాతీయ కోచ్ లు తమను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ  గత రెండు రోజులుగా  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  ఆందోళనకు దిగిన   స్టార్ రెజ్లర్లు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు.  రెండో రోజు నుంచి వారి పోరాటానికి ఊహించని మద్దతు లభిస్తున్న నేపథ్యంలో రెజ్లర్లు  మరింత పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు.  తాజాగా వాళ్లు  భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు  పి.టి.ఉషకు లేఖ రాశారు. ఈ సందర్భంగా వాళ్లు.. బ్రిజ్ భూషణ్ ను తొలగించాలని, డబ్ల్యూఎఫ్ఐని రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. 

పి.టి.ఉషకు రాసిన లేఖను వినేశ్ పోగట్  తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. లేఖలో ఆమె.. ‘డీయర్ మేడమ్.. దేశంలోని రెజ్లర్లందరి తరఫునా  మేము ఈ లేఖ రాస్తున్నాము.  డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ వినేశ్ పోగట్ ను  లైంగికంగా, మానసికంగా వేధించారు. ఆమె తన తనువును చాలించాలని భావించింది. 

డబ్ల్యూఎఫ్ఐ లో  ఉన్న కోచ్ లు, సహాయక సిబ్బంది కూడా  మమ్మల్ని వేధిస్తున్నారు. అక్కడ  ఉన్నవాళ్లంతా బ్రిజ్ భూషణ్   అనుచరులే...’అని  పేర్కొన్నారు. 

 

pic.twitter.com/PwhJjlawPg

— Vinesh Phogat (@Phogat_Vinesh)

రెజ్లర్ల డిమాండ్లు : 

- ఈ విషయంలో ఐఓఏ కల్పించుకుని లైంగిక వేధింపుల మీద  తక్షణమే ఒక కమిటీతో విచారణ చేయించాలి. 
- డబ్ల్యూఎఫ్ఐ  అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలి. 
- డబ్ల్యూఎఫ్ఐని రద్దు  చేయాలి. 
- రెజ్లర్లు, వారి వ్యవహారాలు చూసుకునేందుకు కొత్త కమిటీని నియమించాలి. 

ఆందోళనగా ఉంది : పి.టి. ఉష 

రెజ్లర్ల ఆందోళనపై  పి.టి. ఉష స్పందించారు.  ఒక మహిళగా, మాజీ అథ్లెట్ గా  ప్రస్తుతం క్రీడా పాలకురాలిగా  భారత రెజ్లింగ్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా ఆందోళనగా ఉందని అన్నారు. రెజ్లర్ల నిరసనలపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేగంగా స్పందించింది.  ఈ వ్యవహారంపై భారత  ప్రభుత్వం  సరైన దిశలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా..’అని  తెలిపింది. మహిళా అథ్లెట్ల భద్రత కోసం  ఐఓఏ అన్ని చర్యలనూ తీసుకుంటుందని  ఓ ప్రకటనలో పేర్కొంది. 

 

As IOA President, I've been discussing the current matter of wrestlers with the members and for all of us the welfare and well being of the athletes is the top most priority of IOA. We request athletes to come forward and voice their concerns with us. (1/2)

— P.T. USHA (@PTUshaOfficial)

కుట్ర భయటపెడతా :  బ్రిజ్ భూషణ్ సింగ్ 

రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో   బ్రిజ్ భూషణ్ తన ఫేస్‌బుక్ లో  ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా  ఆయన.. ‘ఈ కుట్ర వెనుక ఎవరున్నారు..?  ఎంపీ (బ్రిజ్ భూషణ్)  అసలు విషయాన్ని బయటపెట్టనున్నాడు..’  అని పేర్కొన్నాడు.  యూపీలోని గోండా జిల్లా  నవాబ్‌గంజ్  లో గల రెజ్లింగ్ ట్రైనింగ్ సెంటర్ లో  సాయంత్రం నాలుగు గంటలకు  రావాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.  

లైంగిక వేధింపులతో పాటు   పలువురు రెజ్లర్లకు  బ్రిజ్ భూషణ్ తో పాటు ఆయన అనుచరుల నుంచి ప్రాణ హానీ ఉందని  బాధితులు వాపోతున్న నేపథ్యంలో ఆయన ఏం చెబుతారో...?  అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
 

click me!