Sonny Ramadhin: నింగికెగిసిన విండీస్ స్పిన్ దిగ్గజం.. ప్రముఖుల నివాళి

Published : Feb 28, 2022, 05:01 PM IST
Sonny Ramadhin: నింగికెగిసిన విండీస్ స్పిన్ దిగ్గజం.. ప్రముఖుల నివాళి

సారాంశం

Sonny Ramadhin Passes Away: మిస్టరీ స్పిన్నర్  గా గుర్తింపు పొందిన  రమాదిన్.. ఇంగ్లాండ్ ను తొలిసారి ఓడించిన విండీస్ జట్టులో సభ్యుడు. అంతేగాక కరేబియన్ల తరఫున ఆడిన తొలి భారతీయ సంతతి క్రికెటర్... 

వెస్టిండీస్ క్రికెట్ లో లెజెండరీ స్పిన్నర్ గా గుర్తింపు పొందిన  దిగ్గజ ఆటగాడు సోని రమాదిన్  ఆదివారం కన్నుమూశారు. 92 ఏండ్ల వయసున్న ఆయన.. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. ఆదివారం తుది శ్వాస విడిచినట్టు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఒక ప్రకటనలో తెలిపింది. భారత సంతతి వ్యక్తి అయిన రమాదిన్.. ఇండియా నుంచి కరేబియన్ల తరఫున ఆడిన తొలి  భారతీయుడిగా గుర్తింపు పొందాడు. 

రమాదిన్ మరణం పట్ల వెస్టిండీస్ తో పాటు అంతర్జాతీయంగా పలువురు క్రికెటర్లు.. ఆయనతో కలిసి ఆడిన  ప్రముఖులు.. ఈ దిగ్గజానికి  ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.1928లో  జన్మించిన  రమాదిన్.. మిస్టరీ స్పిన్నర్ గా గుర్తింపు పొందారు. అప్పట్లో భారత సంతతి ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడమే గగనంగా మారిన దశలో.. రమాదిన్ మాత్రం ఏకంగా జాతీయ జట్టు తరఫున ఆడాడు. ఆడటమే కాదు.. తన తొలి టెస్టులోనే మెప్పించాడు. 

 

1950లో  ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్.. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో  చిరకాలం గుర్తుండిపోయే ప్రదర్శన చేశాడు.  ఆ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన రమాదిన్.. రెండో ఇన్నింగ్స్ లో  ఆరు వికెట్లు తీశాడు.  లార్డ్స్ టెస్టులో మొత్తంగా 152 పరుగులిచ్చి 11 వికెట్లు తీశాడు రమాదిన్..  నాలుగు మ్యాచుల ఈ సిరీస్ ను విండీస్.. 3-1 తేడాతో గెలుచుకుంది.  ఇంగ్లాండ్ పై విండీస్ కు ఇదే తొలి విజయం.. ఈ సిరీస్ గెలవడంలో రమాదిన్, అల్ఫ్ వాలెంటైన్ కీలక పాత్ర పోషించారు. ఈ  స్పిన్ ద్వయం..  నాలుగు టెస్టులలో కలిపి ఏకంగా 59 వికెట్లు పడగొట్టింది.  

రమాదిన్ తన కెరీర్ లో  మొత్తంగా 43 టెస్టులాడి 158 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 184 మ్యాచులాడి ఏకంగా 758 వికెట్లు పడగొట్టాడు. ఆయన మరణంపై విండీస్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. ‘రమాదిన్ మృతికి మా ప్రగాఢ సానుభూతి.  విండీస్ తొలి తరం క్రికెటర్లలో  అతడు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. దేశంలో క్రికెట్ అభివృద్ధికి అతడు ఎంతగానో కృషి చేశాడు. తన అద్భుత ఆటతీరుతో ప్రపంచ  క్రికెట్ మీద కూడా ఎంతో ప్రభావం చూపాడు. 1950 లో  ఇంగ్లాండ్ తో సిరీస్ విజయం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే అందులో  రమాదిన్ పాత్ర కూడా ఉంది..’ అని  తెలిపింది.

PREV
click me!

Recommended Stories

IND vs NZ: అభిషేక్ శర్మ విధ్వంసం.. రింకూ సింగ్ మెరుపులు.. కివీస్‌పై టీమిండియా ఘన విజయం
Abhishek Sharma : సిక్సర్లే సిక్సర్లు.. అభిషేక్ శర్మ షేక్ చేశాడు ! షో అదిరింది బ్రో !