
పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన వెప్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని ముగ్గురు సీనియర్ ఆటగాళ్లతో పాటు ఓ సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన కరోనా పరీక్షలలో వీరికి కరోనా సోకిందని తేలింది. కరోనా వచ్చిన వారిలో ఆ జట్టు సీనియర్ క్రికెటర్లు ఆల్ రౌండర్లు రోస్టన్ చేజ్, కైల్ మేయర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షెల్డన్ కాట్రెల్ తో పాటు సహాయక సిబ్బంది ఒకరు ఉన్నారు. ఈ నలుగురిని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచినట్లు వెస్టిండీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఇటీవలే శ్రీలంక పర్యటన ముగించుకున్న వెస్టిండీస్.. పాక్ కు వెళ్లింది. అక్కడ పాకిస్థాన్ తో మూడు టీ20 లు, మూడు వన్డే మ్యాచులు ఆడాల్సి ఉంది. వన్డేలకంటే ముందు టీ20 సిరీస్ రేపట్నుంచే మొదలుకానుంది. కరాచీ వేదికగా డిసెంబర్ 13న తొలి టీ20 నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కరోనా బారినపడటంతో సిరీస్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఇప్పటికే టీ20 జట్టు నుంచి ఆ టీమ్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ గాయంతో పాక్ పర్యటనకు రాలేదు. ఆండ్రీ రసెల్ కూడా బిగ్ బాష్ లీగ్ లో ఆడుతుండటంతో ఈ సిరీస్ కు అందుబాటులో లేడు. అంతేగాక సీనియర్ ప్లేయర్లు కూడా చాలావరకు గైర్హాజరీలో ఉండగా.. జట్టులో ఉన్న ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు కరోనా సోకడం ఇప్పుడు ఆ జట్టుకు పెద్ద షాకే.
కాగా.. విండీస్ ఆటగాళ్లకు కరోనా సోకిన విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా నిర్ధారించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన బోర్డు.. పది రోజుల దాకా కరోనా సోకిన ఆటగాళ్లు క్వారంటైన్ లో ఉంటారని తెలిపింది. రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్, షెల్డన్ లకు కరోనా రావడంతో జట్టులో మిగతా ఆటగాళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా.. వారికి నెగిటివ్ అని తేలడంతో బోర్డు ఊపిరిపీల్చుకుంది. సిరీస్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది.
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇది :
- డిసెంబర్ 13న తొలి టీ20..
- డిసెంబర్ 14న రెండో టీ20..
- డిసెంబర్ 16న మూడో టీ20..
వన్డే సిరీస్ షెడ్యూల్ :
- డిసెంబర్ 18.. తొలి వన్డే..
- డిసెంబర్ 20.. రెండో వన్డే..
- డిసెంబర్ 22.. మూడో వన్డే..
ఈ మ్యాచులన్నీ కరాచీ వేదికగానే సాగనున్నాయి. కాగా స్వదేశంలో సిరీస్ లు నిర్వహించాలని తాపత్రాయపడుతున్న పాకిస్థాన్ బోర్డుకు కరోనా కూడా షాకిస్తుండగం గమనార్హం. అంతకుముందు సెప్టెంబర్ లో పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఆఖరు నిమిషంలో సిరీస్ ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ కూడా అదే బాటలో నడిచింది.