
ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా, పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది. గ్రూప్ స్టేజీలో పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా, ఫైనల్ మ్యాచ్‌లో 128 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. టాస్ గెలిచి, పాకిస్తాన్‌కి బ్యాటింగ్ అప్పగించిన భారత యువ జట్టు, 352 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 224 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత పాక్ టీమ్‌ని తీవ్రంగా ట్రోల్ చేశారు భారత క్రికెట్ ఫ్యాన్స్. భారత్, ఒక్క అంతర్జాతీయ అనుభవం కూడా లేని 20-23 ఏళ్ల వయసున్న కుర్రాళ్లను ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీ కోసం పంపింది. మరోవైపు శ్రీలంక, పాకిస్తాన్ జట్లలో మాత్రం 29-30 ఏళ్లు పైబడిన ప్లేయర్లు, అంతర్జాతీయ అనుభవం ఉన్న ప్లేయర్లు కూడా ఉన్నారు..
ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‌లో 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు చేసిన తయ్యబ్ తాహీర్ వయసు 30 ఏళ్లు. అతను ఇప్పటికే 3 అంతర్జాతీయ టీ20 మ్యాచులు కూడా ఆడాడు. 30 ఏళ్ల అంకుల్, భారత కుర్రాళ్లపై తన ప్రతాపం చూపించాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అయ్యాయి..
20 ఏళ్ల యశ్ దుల్ కెప్టెన్సీలో సాయి సుదర్శన్, రాజవర్థన్ హంగర్‌గేకర్, రియాన్ పరాగ్ వంటి యువ ప్లేయర్లతో నిండిన టీమిండియా ... మహ్మద్ హారీస్, మహ్మద్ వసీం జూనియర్, షానవాజ్ దహానీ, సియిం ఆయుబ్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న పాకిస్తాన్ టీమ్ ముందు నిలవలేకపోయింది.
ఈ విమర్శలపై తాజాగా తన స్టైల్‌లో కామెంట్ చేశాడు పాకిస్తాన్ ఏ టీమ్ కెప్టెన్ మహమ్మద్ హారీస్.. ‘మేం ఆసియా కప్ గెలిచిన తర్వాత చాలామంది వాళ్లు సీనియర్లను తీసుకొచ్చి, గెలిచారని అంటున్నారు. వాళ్లను ఒక్కటే అడుగుతున్నా, మేం పిల్లలను టోర్నమెంట్‌కి పంపించాలని మేం చెప్పలేదే?
ఇంకా మా టీమ్‌లో చాలామందికి అంతర్జాతీయ అనుభవం ఉందని అంటున్నారు? మేం ఎన్ని అంతర్జాతీయ మ్యాచులు ఆడాం. సయిం 5 మ్యాచులు ఆడాడు, నేను 6 మ్యాచులు ఆడాను. టీమిండియా కుర్రాళ్లు దాదాపు 260 ఐపీఎల్ మ్యాచులు ఆడారు... దాన్ని ఎవ్వరూ పట్టించుకోరేంటి?’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ A జట్టు కెప్టెన్ మహమ్మద్ హారీస్..
పాకిస్తాన్ బ్యాటర్ సయిం ఆయుబ్ 8 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడి 123 పరుగులు చేశాడు. అలాగే 27 ఏళ్ల సహీబ్‌జాదా ఫర్హాన్ 3, తయ్యబ్ తాహీర్ 3 అంతర్జాతీయ మ్యాచులు ఆడగా మహమ్మద్ హారీస్ 5 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 టైటిల్ గెలిచిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో మిగిలిన ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచులు ఆడలేదు. అంతేకాకుండా వారి వయసు కూడా 20-22 ఏళ్ల మధ్యే ఉంది..