
కొన్నాళ్లుగా సంచలన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్. బోర్డర్ గవాస్కర్ 2023 సమయంలో కెఎల్ రాహుల్‌ని కొనసాగించడంపై వెంకటేశ్ ప్రసాద్ వేసిన వరుస ట్వీట్లు, పెను దుమారం రేపాయి. దెబ్బకు కెఎల్ రాహుల్‌ని మూడో టెస్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్...
తాజాగా వెస్టిండీస్‌లో రెండో వన్డేలో ఓడిన భారత జట్టుపై మరోసారి తన స్టైల్‌లో ఫైర్ అయ్యాడు వెంకటేశ్ ప్రసాద్. ‘టెస్టు క్రికెట్‌ని పక్కనబెడితే, మిగిలిన రెండు ఫార్మాట్లలో టీమిండియా ఆటతీరు చాలా సాధారణంగా ఉంది. బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్ కోల్పోయింది. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది.
ఆఖరికి ఆస్ట్రేలియాలోనూ వన్డే సిరీస్ కోల్పోయింది. ఆఖరి రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ చెత్తగా ఆడింది. ఇంగ్లాండ్‌లాగా ఇంట్రెస్టింగ్‌గా ఆడలేకపోతున్నాం, ఆస్ట్రేలియాలా క్రూరంగా ఆడలేకపోతున్నాం..
అవును, మన దగ్గర చాలా డబ్బు ఉంది, డబ్బుతో వచ్చిన అధికారం ఉంది అంతే. వాటిని ఉపయోగించి మనం సర్వసాధారణ ఆటతీరును గప్పగా చూపించుకుంటున్నాం. ఛాంపియన్ టీమ్‌కి ఉండాల్సిన లక్షణాలు మన టీమ్‌లో లేవు. ప్రతీ గెలవడానికే ఆడుతుంది కానీ టీమిండియాలో మాత్రం ఆ కసి కనిపించడం లేదు. కొన్నేళ్లుగా టీమిండియా ఆటతీరు, ఏదో ఆడాలని ఆడుతున్నట్టుగా ఉంది...’ అంటూ వరుస ట్వీట్లు చేశాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...
వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయంతో క్రికెట్ ఫ్యాన్స్ ఏకీభవిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొల వన్డేలో 115 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన టీమిండియా, సౌతాఫ్రికా టూర్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా చేస్తున్న ప్రయోగాలపై ఫ్యాన్స్ విసుగు చెందుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లో మ్యాచులు ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ రకమైన ఆటతీరుతో టీమిండియా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని ఎలా గెలుస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు, గాయంతో టీమ్‌కి దూరంగా ఉండడం.. భారత జట్టు విజయావకాశాలను తీవ్రంగా దెబ్బ తీస్తోంది..