మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే..! ఇంగ్లాండ్ పరువు తీసిన వసీం జాఫర్.. పరోక్షంగా వాన్ కు చురకలు..

Published : Jun 03, 2022, 01:17 PM IST
మీరు చేస్తే సంసారం.. మేము చేస్తే..! ఇంగ్లాండ్ పరువు తీసిన  వసీం జాఫర్.. పరోక్షంగా వాన్ కు చురకలు..

సారాంశం

ENG vs NZ: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు లో తొలి రోజే 17 వికెట్లు నేలకూలాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. 

ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజే 17 వికెట్లు పడ్డాయి.  తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్లూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ కు చేరాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో పాటు లార్డ్స్  గ్రౌండ్ ను,  తనకు ఇష్టమైన శత్రువు మైఖేల్ వాన్ ను కూడా ట్రోల్ చేశాడు. ఒకే ఒక్క ట్వీట్ తో  లార్డ్స్ తో పాటు వాన్, ఇంగ్లాండ్ ల పరువు తీసి గంగలో కలిపాడు. 

లార్డ్స్ లో తొలిరోజే 17 వికెట్లు నేలకూలిన అనంతరం జాఫర్  స్పందిస్తూ.. ‘లార్డ్స్ లో ఒక్కరోజే 17 వికెట్లు నేలకూలితే అది బౌలర్ల నైపుణ్యాలు, వాళ్ల గొప్పతనం గురించి మాట్లాడతారు. అదే అహ్మదాబాద్ లో ఒకటే రోజు 17  మంది ఔటైతే ఇక్కడి పరిస్థితులు, పిచ్ గురించి మాట్లాడతారు..’ అని  ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రెడీ సినిమాలోని ‘హమ్ కరే తో సాలా క్యారెక్టర్ ఢీలా హై..’ మీమ్ ను కూడా జతపరిచాడు. 

 

ఈ ట్వీట్ ద్వారా  జాఫర్.. వాన్ ను టార్గెట్ చేశాడని  అర్థమవుతూనే ఉన్నది. ఇంగ్లాండ్ జట్టు.. 2021 లో  ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు  అహ్మదాబాద్ లో నాలుగో టెస్టు జరిగింది.  ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 365 పరుగులు చేసి ఆలౌట్ అయింది.  మూడో రోజు ఉదయం భారత్ బ్యాటింగ్ చేయగా.. మిగిలిన నాలుగు వికెట్లను తొలి సెషనల్ లోనే కోల్పోయింది.  ఇక అదే రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లకే 135 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 

దీంతో ఈ పిచ్ పై మైఖేల్ వాన్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. సోషల్ మీడియాలో పూర్తిగా గడ్డి తొలిగించి మట్టి పెళ్లల మీద ఆడుతున్నట్టుగా ఉండే విధంగా ఓ వీడియో ను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు అప్పట్లో జాఫర్ కౌంటర్ ఇచ్చాడు.

 

ఇక తాజాగా లార్డ్స్ టెస్టులో  కూడా ఒకే రోజు ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ ను ఆలౌట్ చేయడమే గాక తానూ 7 వికెట్లు నష్టపోయింది. లార్డ్స్ లో జరుగుతున్న తొలి టెస్టులో  తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్ లో 132 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.  

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?