రెండు సంస్థల్లో భాగస్వామిగా కోహ్లీ.. రూల్స్ అతిక్రమించాడంటూ..

By telugu news teamFirst Published Jul 6, 2020, 7:34 AM IST
Highlights

ఇప్పడు ఆ సెగ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగిలింది. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్‌ఎల్‌పి కంపెనీ డైరెక్టర్‌గా ఉండటంతో పాటు కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అనుకోని చిక్కు వచ్చిపడింది. ఆయనకు కాన్ ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్( పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) సెగ తగిలింది. 2017లో సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. 

బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్ లేదా ఉద్యోగి.. బోర్డుతో అనుబంధంగా ఉన్న ఏ సంస్థల్లోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వామిగా ఉండకూడదనేది నిబంధన. ఇప్పడు ఆ సెగ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగిలింది. విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్‌ఎల్‌పి కంపెనీ డైరెక్టర్‌గా ఉండటంతో పాటు కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇలా రెండు కంపెనీలకు డైరెక్టర్ హోదాలో ఉండటం విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా తాజాగా బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్‌కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. అందులో తాను స్వప్రయోజనాల కోసం ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేసిన సంజీవ్ గుప్తా.. లోధా కమిటీ పేర్కొన్న క్లాజ్‌ల్లోని నిబంధనల్ని అందులో ప్రస్తావించాడు. ఒకవేళ విరాట్ కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాలుంటే.. ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

కాగా.. కోహ్లీకి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుని పరిశీలిస్తున్నట్లు జస్టిస్ జైన్ తెలిపారు. తమకు కోహ్లీపై ఫిర్యాదు అందిందని.. దానిని పరిగణలోకి తీసుకోవాలో వద్దో తాము పరిశీలిస్తామని చెప్పారు. ఒక వేళ ఈ ఫిర్యాదుపై పరిశీలించే అవకాశం ఉంటే.. దీనిపై వివరణ ఇచ్చేందుకు కోహ్లీకి అవకాశం ఇస్తామని చెప్పారు. 

click me!