ఆటగాళ్ల 'బుడగ' బాధలు, స్పందించిన కోహ్లీ

By team teluguFirst Published Mar 23, 2021, 8:26 AM IST
Highlights

ఆటగాళ్లపై పని ఒత్తిడి, బుడగ బాధలు పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌ సిద్ధం చేయాలని క్రికెటర్లు కోరుతున్నారు. ఈ విషయంలో ఇంగ్లాండ్‌ ముందుంది. బుడగ కష్టాల నేపథ్యంలో క్రికెటర్ల రొటేషన్‌ పాలసీ తీసుకొచ్చింది.

కరోనా దెబ్బకు ప్రపంచమే లాక్ డౌన్ లో మగ్గిపోయింది. గత సంవత్సరాన్ని వెనక్కి తిప్పి చూసుకుంటే లాక్ డౌన్ తప్ప వేరే ఏమీ  ఉండదు. ఇలాంటి తరుణంలో క్రికెట్ ని పునఃప్రారంభించడానికి బయో సెక్యూర్ బబుల్ ని ఏర్పాటు చేసారు క్రికెట్ ముందుకు సాగడానికి ఏర్పడిన పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అయింది. కానీ ఇదే ఇప్పుడు ప్లేయర్లకు ఇబ్బందికరంగా మారింది. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 లీగ్‌ కోసం చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 2020 ఆగస్టు 21న దుబాయికు చేరుకున్నాయి. రెండు రోజుల అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ సహా ఇతర జట్లు యుఏఈకి చేరుకున్నాయి. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, రిషబ్‌ పంత్‌లు అప్పట్నుంచి బయో సెక్యూర్‌ బబుల్స్‌లోనే గడుపుతున్నారు. 

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు కొన్ని రోజులు మినహాయిస్తే ఈ ఆటగాళ్లు పూర్తిగా బుడగలోనే ఉన్నారు. ఐపీఎల్‌ 2021 ఆఖరు వరకూ ఈ ముగ్గురు క్రికెటర్లు బుడగలోనే ఉండనున్నారు. కోవిడ్‌-19 నిబంధనలతో సుమారు తొమ్మిది నెలలు బయో సెక్యూర్‌ బబుల్స్‌లోనే ఉండాల్సి రావటం గమనార్హం. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా బయో బబుల్స్‌ సాధారణమైంది. 

ఆటగాళ్లపై పని ఒత్తిడి, బుడగ బాధలు పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌ సిద్ధం చేయాలని క్రికెటర్లు కోరుతున్నారు. ఈ విషయంలో ఇంగ్లాండ్‌ ముందుంది. బుడగ కష్టాల నేపథ్యంలో క్రికెటర్ల రొటేషన్‌ పాలసీ తీసుకొచ్చింది. ఫలితంగా భారత్‌తో టెస్టు సిరీస్‌కు బలమైన జట్టును బరిలోకి నిలుపలేకపోయినా.. పట్టించుకోలేదు. బబుల్‌ భయంతో జోఫ్రా ఆర్చర్‌ బిగ్‌బాష్‌ లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. 

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ అనంతరం భారత క్రికెటర్లు అందరూ ఐపీఎల్‌ బబుల్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి షెడ్యూల్‌పై స్పందించాడు. 'షెడ్యూల్‌ మా నియంత్రణలో లేదు. మాకు సంబంధించి ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌ ముఖ్యమే, ప్రతి మ్యాచ్‌కు విలువ ఉంటుంది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం అది. మా పూర్తి ఫోకస్‌ దానిపైనే ఉంటుంది. నేను గతంలోనూ చెప్పాను. షెడ్యూల్‌, పని భారం ప్రతి ఒక్కరూ గమనంలో ఉంచుకోవాలి. ఎప్పుడు ఎటువంటి నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలియదు. భవిష్యత్‌లో మేము మరిన్ని బయో బబుల్స్‌లోనే గడపాల్సి ఉంటుంది. ఇది కేవలం శారీరకమే కాదు మానసికంగానూ ఆలోచన చేయాలి. ఆటగాళ్లను సంప్రదించి, మాట్లాడాలి' అని విరాట్‌ కోహ్లి అన్నాడు.

click me!