నేడే ఇంగ్లాండ్ తో తొలి వన్డే, విరాట్ కోహ్లీ ముందున్న పెను సవాలు ఇదే...

By team teluguFirst Published Mar 23, 2021, 8:02 AM IST
Highlights

వన్డే వరల్డ్‌కప్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌తో ఆడిన చివరి ఐదు వన్డేల్లో భారత్‌ ఏకంగా నాలుగు సార్లు పరాజయం చవిచూసింది. వన్డే తాజా రికార్డులు ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. తాజా ఫామ్‌తో భారత్‌ వన్డే సిరీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

భారత్‌, ఇంగ్లాండ్‌ సమరం ముచ్చటగా మూడో ఫార్మాట్‌కు చేరుకుంది. టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కోహ్లిసేన.. టీ20ల్లో ఇంగ్లీష్‌ జట్టుకు గర్వభంగం చేసింది. ఇప్పుడు 50 ఓవర్ల ఆటలోనూ ఇంగ్లాండ్‌పై పంచ్‌ విసిరేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. పరిమిత ఓవర్ల ఆటలో అగ్రజట్టు ఇంగ్లాండ్‌ను ఓడించటం అంత సులువు కాదు. 

వన్డే వరల్డ్‌కప్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌తో ఆడిన చివరి ఐదు వన్డేల్లో భారత్‌ ఏకంగా నాలుగు సార్లు పరాజయం చవిచూసింది. వన్డే తాజా రికార్డులు ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. తాజా ఫామ్‌తో భారత్‌ వన్డే సిరీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పుణె స్టేడియంలోనే మూడు వన్డేలు జరుగనున్నాయి. నేడు మధ్యాహ్నాం 1.30 గంటలకు భారత్‌, ఇంగ్లాండ్‌ ల మధ్య తొలి వన్డే ఆరంభమవనుంది. 

టీం ఎంపిక విరాట్ కి పెను సవాలు... 

వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి ముందు తుది జట్టు కూర్పు సవాళ్లు ఉన్నాయి. టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా అవకాశాలు అందుకోని శిఖర్‌ ధావన్‌.. తిరిగి రోహిత్‌ శర్మతో జోడీకట్టడం లాంఛనమే. అదనపు ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలా? ఆరో బౌలర్‌ను ఎంచుకోవాలా? బ్యాటింగ్‌ లైనప్‌లో అదనపు బ్యాట్స్‌మన్‌ కెఎల్‌ రాహుల్‌కు చోటు ఇవ్వాలా? అనే అంశాల్లో కెప్టెన్‌ కోహ్లి తేల్చుకోవాల్సి ఉంది. 

టీ20ల్లో రాణించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు అరంగ్రేట అవకాశం ఇవ్వటంపైనా చర్చ నడుస్తోంది. రిషబ్‌ పంత్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు నేరుగా తుది జట్టులోకి రానున్నారు. మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు సిరీస్‌లో కీలకం కానున్నారు.

టీ20ల్లో తనదైన ఇన్నింగ్స్‌ ఆడేందుకు అవకాశం రాకపోవటంతో.. వన్డేల్లో చెలరేగేందుకు రిషబ్‌ పంత్‌ ఎదరుచూస్తున్నాడు. భువనేశ్వర్‌, శార్దుల్‌ ఠాకూర్‌లకు తోడుగా మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌లలో ఒకరు పేస్‌ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. యుజ్వెంద్ర చాహల్‌కు తోడుగా కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌లలో ఒకరు తుది జట్టులో ఉండనున్నారు.

పిచ్, వెదర్ కండిషన్స్

వైట్‌ బాల్‌ ఫార్మాట్‌కు పుణె పిచ్‌ సహజంగానే బ్యాటింగ్‌కు అనుకూలం. పుణె పిచ్‌లు స్పిన్‌కు సైతం స్వర్గధామం కావటంతో ఇక్కడ మాయగాళ్ల మ్యాజిక్‌ ఎప్పుడూ అవకాశం ఉంటుంది. బౌండరీ లైన్‌ దగ్గరగా ఉండటంతో బౌలర్లు కాస్త ఎక్కువ శ్రమించాల్సిందే. పుణెలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు ఉండనుంది. తొలుత ఫీల్డింగ్‌ చేసిన జట్టుకు ఇది సవాల్‌ విసరనుంది. మంచు ప్రభావం రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసే జట్టుపై గట్టిగానే ఉండనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.

 

click me!