అత్యుత్తమ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ... అరుదైన గౌరవం

By telugu teamFirst Published Dec 27, 2019, 8:10 AM IST
Highlights

2014లో ఇంగ్లండ్ పర్యటన ముగిసినప్పటి నుంచి నవంబరులో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మధ్య కోహ్లీ 63 సగటుతో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీ సాధించాడని విజ్డన్ పేర్కొంది.

టీమిండియా కెప్టెన్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీకి మరో అరుదైన ఘనత దక్కింది. విజ్డన్ ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది. అలాగే, దక్షిణాఫ్రికా క్రికెటర్లు డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, విమెన్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ తదతర ఐదుగురికి ఈ దశాబ్దపు క్రికెటర్ల జాబితాలో చోటు లభించింది.

అత్యధిక పరుగులు చేసి తన జాబితాలో ఎన్నో రికార్డులను కోహ్లీ వేసుకున్న సంగతి తెలిసిందే. దాని మూలంగానే ఇప్పుడు కోహ్లీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. గత పదేళ్లలో కోహ్లీ మరెవకీ సాధ్యం కానంతగా మిగతా వారికంటే అదనంగా 5,775 పరుగులు చేశాడు. దీంతో 31 ఏళ్ల కోహ్లీని ‘విజ్డన్ టెస్ట్ టీం ఆఫ్ ది డెకేడ్’ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. కోహ్లీ అత్యంత మేధావని, ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కొని ఎదగాడని విజ్డన్  పొగడ్తల వర్షం కురిపించింది.

2014లో ఇంగ్లండ్ పర్యటన ముగిసినప్పటి నుంచి నవంబరులో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మధ్య కోహ్లీ 63 సగటుతో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీ సాధించాడని విజ్డన్ పేర్కొంది.
 
ఈ పరుగులే కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడిగా చెబుతున్నాయని...  మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ 50 సగటు కలిగిన ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ కోహ్లీ అని విజ్డన్ పేర్కొంది. స్మిత్ ఆ మార్క్‌కు చేరుకున్నా.. కోహ్లీ అంత వేగంగా కాదని విజ్డన్ స్పష్టం చేసింది. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత, ధోనీ ప్రభ క్రమంగా తగ్గుతూ వచ్చిన తర్వాత ప్రపంచంలో మరెవరూ కోహ్లీ అంత ఒత్తిడిని ఎదుర్కొని రాణించలేదని వివరించింది.
 
గత పదేళ్లలో కోహ్లీ 27 శతకాలతో టెస్టుల్లో 7,202 పరుగులు చేశాడు. వన్డేల్లో 11,125 పరుగులు, టీ20ల్లో 2,633 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా సగటుతో 70 సెంచరీలు చేశాడు. రికీ పాంటింగ్ (71), సచిన్ టెండూల్కర్ (100)లు మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీది మూడో స్థానం. 21,444 పరుగులతో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా, 27,483 పరుగులతో పాంటింగ్ రెండో స్థానంలోనూ, 34,357 పరుగులతో టెండూల్కర్ అగ్రస్థానంలోనూ కొనసాగుతున్నారు.

click me!