
టీమిండియాలో రిషబ్ పంత్ చాలా తుంటరి. క్రీజులో నిర్భయంగా నిలబడి, స్టార్ బౌలర్లకు చుక్కలు చూపించే రిషబ్ పంత్, ఆఫ్ ఫీల్డ్‌లో తన తోటి ప్లేయర్లను ఆటపట్టిస్తూ... మహా చలాకీగా ఉంటాడు.
ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ జరిగినప్పుడు రోహిత్ శర్మతో, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ జరిగినప్పుడు మహేంద్ర సింగ్ ధోనీతో టాస్ సమయంలో పరాచకాలు ఆడుతూ కనిపించాడు రిషబ్ పంత్...
అయితే మహేంద్ర సింగ్ ధోనీ వంటి సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్‌తో కూడా పరాచకాలు ఆడుతూ అల్లరి చేయగలిగే రిషబ్ పంత్... విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంతో వినయుడిగా మారిపోయి, బుద్ధిగా ప్రవర్తించుకుంటాడు.
ఎందుకంటే విరాట్ కోహ్లీ అల్లరి, ఎనర్జీ, యాటిట్యూడ్ ముందు రిషబ్ పంత్... చిన్న పిల్లాడిలా మారిపోతాడు. అది కోహ్లీ కెప్టెన్ కావడం వల్ల వచ్చిన గౌరవంతో కూడిన వినయం కూడా కావచ్చు...
తాజాగా లార్డ్స్ టెస్టులో కూడా రిషబ్ పంత్‌తో ఆడుకుంటూ కనిపించాడు విరాట్ కోహ్లీ. వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో ఓ బంతిని ఆపేందుకు డైవ్ చేసిన రిషబ్ పంత్ చేతి నుంచి బ్రాస్‌లైట్ జారి కిందపడిపోయింది.
దాన్ని తీసుకున్న విరాట్ కోహ్లీ... రిషబ్ పంత్ చెవికి దాన్ని అలంకారంగా వేశాడు. ఆ తర్వాత ఏదో కామెంట్ చేసి, మళ్లీ తీసి వేశాడు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...