టీమిండియాకు పంత్ కేవలం ఆప్షన్ కాదు... సొల్యూషన్: సౌరవ్ గంగూలీ

By Arun Kumar PFirst Published Sep 28, 2019, 3:51 PM IST
Highlights

వరుస వైఫల్యాలతో సతమతమవుతూ అభిమానులు, మాజీల నుండి యువ క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో అతడికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దుతుగా నిలిచాడు. 

ఈ మధ్యకాలంలో భారత క్రికెట్ వర్గాల్లో అత్యధిక చర్చకు కారణమవుతున్న ఆటగాడు రిషబ్ పంత్. వన్డే ప్రపంచకప్ కు ముందంతా అతన్ని జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుకున్నారు. కానీ టీ20 వరల్డ్ కప్ కు ముందుమాత్రం అతన్ని జట్టులో కొనసాగించకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా కేవలం కొన్ని నెలల్లోనే పంత్ ఆకాశంనుండి అత:పాతాళానికి పడిపోయాడు. కేవలం అభిమానులే కాదు కొందరు మాజీ క్రికెటర్లు సైతం ఈ యువ క్రికెటర్ పై విరుచుకుపడుతున్నారు. ఇలా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న పంత్ కు టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు. 

''రిషబ్ పంత్ ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. అతడిలో దాగున్న అత్యుత్తమ ప్రతిభ ఐపిఎల్ లోనే బయటపడింది. అంతర్జాతీయ జట్టులో కూడా అతడి ఆరంగేట్రం అదిరింది. కానీ ఆ తర్వాతి నుండి కాస్త తడబడుతూ పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ లో మాత్రం అతడు మెరుగైన ప్రదర్శనే కనబరుస్తున్నాడు.

నా వరకు అయితే అతడు ఇప్పటికీ గొప్ప ఆటగాడే. టీమిండియా ముందు అతడికంటే గొప్ప ఆప్షన్ లేదు. అన్ని ఫార్మాట్లకు సరిపోయే ఆటగాడు పంత్. కాబట్టి అతడు ఎప్పటికీ ఓ ఆప్షన్ కాదు... భారత జట్టు ముందున్న ఒకే ఒక సొల్యూషన్. అంతర్జాతీయ క్రికెట్ లో మరోస్థాయికి చేరుకునే సత్తా వున్న ఆటగాడు. కాబట్టి ఇలాంటి ప్రతిభావుంతుడైన ఆటగాన్ని మనమందరం తప్పకుండా ప్రోత్సహించాలి. ముఖ్యంగా అతడి సహచర క్రికెటర్లు.'' అంటూ పంత్ కు గంగూలీ మద్దతుగా నిలిచారు. 

మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాత్రం ఇదివరకే పంత్ పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. టీమిండియాకు వికెట్ కీపర్ గానే కాదు బ్యాట్స్ మెన్ గా కూడా పంత్ పనికిరాడంటూ కాస్త ఘాటుగా విమర్శించాడు. కేవలం టీమిండియా మేనేజ్‌మెంట్ పుణ్యానే అతడింకా జట్టులో కొనసాగుతున్నాడని... లేదంటే ఎప్పుడో పంత్ భారత జట్టులో చోటు కోల్పోయేవాడని గంభీర్ అన్నాడు. కేవలం గంభీర్ ఒక్కడే కాదు మరికొందరు మాజీలు కూడా పంత్ ను విమర్శిస్తున్నవారిలో వున్నారు. 

పంత్ విషయంలో తమపై వస్తున్న ఆరోపణలను తగ్గించుకునేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సీరిస్ లో పంత్ ను కాకుండా వృద్దిమాన్ సాహాను ఆడించాలని నిర్ణయించిందట. దీన్ని దృష్టిలో వుంచుకునే తాజాగా గంగూలీ పంత్ కు మద్దతిచ్చివుంటాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

click me!