శ్రీలంక ఆటగాళ్లకు పాక్ కంటే ఐపిఎలే ముఖ్యం...అందుకే వెనక్కి: అఫ్రిది

By Arun Kumar PFirst Published Sep 20, 2019, 9:34 PM IST
Highlights

అసలు సంబంధమే లేని విషయంలో భారత్ హస్తం వుందంటూ పాకిస్థాన్ వివాదాస్పద క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన అక్కసును వెల్లగక్కాడు. శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్ లో పర్యటించడానికి విముఖత ప్రదర్శిస్తే అందుకు భారతే కారణమంటూ అతడు అర్థంలేని  వాదనను మొదలుపెట్టాడు.  

శ్రీలంక క్రికెటర్లు కొందరు పాకిస్థాన్ పర్యటనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. గతంలో పాక్ పర్యటన సందర్భంగా తమపై జరిగిన దాడిని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నామని... అందువల్లే పాక్ లో పర్యటించడానికి సుముఖంగా లేమని సదరు ఆటగాళ్లు ఇప్పటికే కారణం కూడా తెలియజేశారు. కానీ పాకిస్థాన్ మీడియాతో పాటు రాజకీయ నాయకులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఇందుకు భారతే కారణమని గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ, వివాదాస్పద  క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా శ్రీలంక ఆటగాళ్లు భారత ఒత్తిడికి తలొగ్గే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించాడు. 

''అంతర్జాతీయ క్రికెటర్లకు ఐపిఎల్ ద్వారా భారీ ఆదాయం లభిస్తోంది. దీంతో అందులో పాల్గొంటున్న కొందరు విదేశీ ఆటగాళ్ళు తమ దేశంకంటే ఈ టోర్నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని అడ్డుపెట్టుకునే శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు రాకుండా భారత్ అడ్డుకుంటోంది. వారిచేత పాకిస్థాన్ భద్రతపై అంతర్జాతీయ సమాజంలో అనుమానాలు రేకెత్తించాలన్నది భారత్ వ్యూహంగా కనిపిస్తోంది.

Latest Videos

ప్రస్తుతం పాక్ పర్యటనను తిరస్కరించిన ఆటగాళ్లలో చాలామంది ఐపిఎల్ ఆడతున్నారు. వారందరు ఐపిఎల్ నిర్వహకులతో, ఫ్రాంచైజీలతో  కాంట్రాక్ట్ కలిగివున్నారు. పాక్  లో పర్యటిస్తే ఈ ఒప్పందాన్ని రద్దు చేసి ఐపిఎల్ ఆడకుండాచేస్తామని బిసిసిఐ బెదిరించింది. అందువల్లే వారు పాకిస్థాన్ పర్యటన కంటే ఐపిఎలే ఎక్కువని  భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు. 

శ్రీలంక లో కూడా భయానక పరిస్థితులు  చోటుచేసుకున్న సమయంలోనూ మేము ఆ దూశంలో పర్యటించాం. నైతిక మద్దతు ప్రకటించాం. ఈ విషయాన్ని లంక ఆటగాళ్లు  మరిచిపోయినట్లున్నారు. భారత్ బెదిరింపులకు భయపడకుండా ఇప్పటికైనా పాక్ పర్యటనకు  రావాలనుకుంటే తాము సాదరంగా ఆహ్వానిస్తాం.'' అని అఫ్రిది పేర్కొన్నాడు.

శ్రీలంక సీనియర్‌ ఆటగాళ్లు లసిత్‌ మలింగ, మాథ్యుస్‌, కరుణరత్నే తదితరులు కూడా పాక్‌ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఇలా మొత్తం 10 మంది ఆటగాళ్లు పాక్ లో అడుగుపెట్టేందుకు సముఖంగా లేరు. కానీ ఆటగాళ్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా శ్రీలంక బోర్డు ఏకపక్ష నిర్ణయాలు  తీసుకుంటోంది.  తమ జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి శ్రీలంక క్రికెట్‌ బోర్డు గురువారం నిర్ణయం తీసుకుంది. 

click me!