
ఆస్ట్రేలియా జాతీయ క్రీడ క్రికెట్. కంగారూల దేశంలో క్రికెట్ కు ఉన్న ప్రాముఖ్యత, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. స్లెడ్జింగ్ కు పెట్టింది పేరైన ఆసీస్.. తాను ఏం చేసినా కరెక్ట్.. ఇతరులు ఏం చేసినా తప్పు అనే ధోరణిలో ఉంటుంది. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ లో జోస్ బట్లర్ ను ‘మన్కడ్’ రూపంలో రనౌట్ చేస్తే క్రీడా స్ఫూర్తి మీద లెక్చర్లు దంచిన ఆసీస్ మాజీలు మాథ్యూ వేడ్ ఘటనపై మాత్రం మౌనం దాల్చుతున్నారు. ‘క్రీడా స్ఫూర్తి’కి బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే కంగారూలు.. వేడ్ చేసినదానికి ఏమంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం ముగిసిన తొలి టీ20లో భాగంగా ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 17వ ఓవర్ ను మార్క్ వుడ్ వేశాడు. ఆ ఓవర్లో భారీ షాట్ ఆడబోయాడు వేడ్. కానీ బంతి మాత్రం అక్కడే గాల్లోకి లేచింది. దీంతో వెంటనే బంతిని అందుకునేందుకు వుడ్ బ్యాటర్ వైపునకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు.
దాదాపు బంతిని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వుడ్ ను వేడ్ అడ్డుకున్నాడు. చేతితో వుడ్ ను అడ్డుకుని అతడిని పక్కకు నెట్టాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్న బౌలర్‌ని కానీ ఫీల్డర్‌ని కానీ ఉద్దేశపూర్వకంగా ఆపినా, అడ్డుకున్నా ఆ బ్యాటర్‌ని అవుట్‌గా ప్రకటించాలి అంపైర్లు. అయితే కొద్దిసేపు చర్చించుకున్న ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ని అప్పీలు చేయాల్సిందిగా కోరారు. అయితే బట్లర్ అప్పీలు చేయకపోవడంతో థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయలేదు.
అయితే మ్యాచ్ ముగిశాక వేడ్ పై విమర్శల వర్షం కురిసింది. అతడు చేసింది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆసీస్ మాజీలకు అనిపించడం లేదా..? అని నెటిజన్లు ట్రోల్ చేశారు. ఓ యూజర్ స్పందిస్తూ.. ‘క్రీడా స్ఫూర్తికి సీఈవో అయిన వేడ్.. వుడ్ ను క్యాచ్ పట్టకుండా అడ్డుకుంటున్నాడు..’ అని ట్వీట్ చేశాడు. దానికి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘మరి మన ఇంగ్లీష్ ఫ్రెండ్స్ దీనిమీద నిశ్శబ్దంగా ఉంటారంటావా...?’ అని ఫన్నీ పోస్ట్ పెట్టాడు. మరికొందరేమో.. ‘వాళ్లు ఆడేది క్రికెట్ అని మరిచిపోయారేమో.. ఫుట్బాల్ అనుకుంటున్నారా..?’, ‘వేడ్ చీటర్’, ‘మాథ్యూ వేడ్ చేసింది తప్పు. కానీ అతడు ఇంగ్లాండ్ మీద చేశాడు కాబట్టి ఓకే..’, ‘ఇది వేడ్ చేశాడు కాబట్టి సరిపోయింది గానీ ఎవరైనా ఇండియా క్రికెటర్ చేసుంటే ఈ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మీడియా ఊరికే ఉండేదా..?’ అని కామెంట్స్ చేస్తున్నారు.