
ఆస్ట్రేలియాకు అందని ద్రాక్ష గా మిగిలిన టీ20 ప్రపంచకప్ ను ఆ దేశానికి అందించిన ఆరోన్ ఫించ్ కు గడ్డుకాలం ఎదుర్కుంటున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఫించ్.. బిగ్ బాష్ లీగ్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంకతో ఆదివారం ముగిసిన ఐదు మ్యాచుల సిరీస్ ను గెలిచినా ఫించ్ ప్రదర్శన మాత్రం నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఫించ్ తో పాటు టెస్టులలో ఆ జట్టు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మాజీ సారథి స్టీవ్ స్మిత్ కూడా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఈ ఇద్దరూ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారిన నేపథ్యంలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలి.. వాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరూ ఇక తప్పుకుంటే బెటరని కామెంట్ చేశాడు.
శ్రీలంకతో ఐదో టీ20 ముగిసిన అనంతరం ఇయాన్ హీలి స్పందిస్తూ... ‘గత కొద్దికాలంగా ఫించ్ ప్రదర్శన చూస్తుంటే అతడు జట్టులో ఉండటం అవసరమా..? అనిపిస్తున్నది. అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. మూడేండ్లుగా ఫించ్ పెద్దగా రాణించింది కూడా లేదు. అంతకుముందు పవర్ హిట్టింగ్ లో దుమ్ము దులిపిన ఫించ్ లో ఇప్పుడు అది లోపించింది. గతంలో మాదిరిగా అతడు భారీ హిట్టింగు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించాడు.
హీలి చెప్పినట్టుగానే శ్రీలంకతో ముగిసిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఫించ్ పూర్తిగా చేతులెత్తేశాడు. 5 టీ20లలో కలిపి ఫించ్ చేసింది 78 పరుగులు మాత్రమే. నిన్న ముగిసిన చివరి టీ20లో అయితే 8 పరుగులు చేశాడు. అదీగాక 2018 నుంచి ఫించ్ బ్యాటింగ్ సగటు కూడా దారుణంగా తగ్గుతున్నది.
2018లో 40.84 సగటు (స్ట్రైక్ రేట్ 176.41) తో ఉన్న ఫించ్.. గతేడాదికి వచ్చే సరికి 28.68 (స్ట్రైక్ రేట్ 125.06) కు పడిపోయాడు.
ఫించ్ తో పాటు మరో టాపార్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను కూడా పక్కనబెట్టాలని హీలి అన్నాడు. ‘టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి స్మిత్ ఇంకా మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఈ జట్టు గురించి మనం సరైన నిర్ణయం తీసుకోవాల. తుది జట్టులో స్మిత్ కు చోటు కల్పించడం కోసం మాక్స్వ్ల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ వంటి ఆటగాళ్ల పై వేటు వేయరాదు..’ అని హీలి అభిప్రాయపడ్డాడు. ఇదిలాఉండగా.. ఈ ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో కూడా అమ్ముడుపోలేదు.
ఇక ఆదివారం నాటి ఆసీస్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరు మ్యాచులో లంకకు ఊరట విజయం దక్కింది. తొలి నాలుగు మ్యాచుల్లో ఓడి సిరీస్ కోల్పోయిన లంక.. ఈ మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఆసీస్ ఆధిపత్యాన్ని 4-1కి తగ్గించింది. ఆసీస్ విధించిన 155 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.