ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకి అతిథులుగా ఇరు దేశాల ప్రధానులు... నరేంద్ర మోదీతో పాటు ఆంథోనీ అల్బనీస్...

By Chinthakindhi RamuFirst Published Feb 2, 2023, 2:12 PM IST
Highlights

మార్చి 9న అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఆఖరి టెస్టు... ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్.. 

న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీసులను ముగించిన టీమిండియా... బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే ఈ నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్, టీమిండియాకి చాలా అవసరం.. 

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, ఫైనల్ చేరాలంటే ఈ టెస్టు సిరీస్‌లో కనీసం 2 మ్యాచులు అయినా గెలవాల్సి ఉంటుంది... నాలుగు టెస్టుల్లో మూడింట్లో గెలిచినా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి ఎగబాకుతుంది భారత జట్టు...

నాగ్‌పూర్‌లో తొలి టెస్టు జరగబోతుండగా ఆ తర్వాత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు ప్రారంభం అవుతుంది. మార్చి 1న ధర్మశాలలోని హెచ్‌పీసీఏలో మూడో టెస్టు జరిగితే మార్చి 9న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది..

గాయంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టులో బరిలో దిగడం లేదు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం దక్కవచ్చు. లేదంటే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసి శుబ్‌మన్ గిల్‌ని శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో ఆడించే అవకాశం కూడా ఉంది.. అదే జరిగితే సూర్యకుమార్ యాదవ్, టెస్టు ఎంట్రీ కోసం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే... 

నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని టీమిండియాకి ఫెవరెట్ గ్రౌండ్‌గా మార్చేసిన బీసీసీఐ, ఆఖరి టెస్టుకి ముఖ్య అతిథులుగా ఇరుదేశాల ప్రధానులను ఆహ్వానించాలని భావిస్తోందట. మార్చి నెలలో భారత పర్యటనకు వచ్చే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ... ఫైనల్ టెస్టు మ్యాచ్‌ని వీక్షించబోతున్నారని వార్తలు వస్తున్నాయి...

మార్చి 9న ప్రారంభమయ్యే ఈ టెస్టు ఐదు రోజుల పాటు సాగితే మార్చి 13న సాగుతుంది... అయితే ఇండియాలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగడం చాలా కష్టం. అందుకే టెస్టు మొదటి రోజునే స్టేడియంలో ఇద్దరు ప్రధానులను చూసే అవకాశం దొరకొచ్చు. 

ఇదే జరిగితే నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ శా, ఆయన కుమారుడు, బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీతో పాటు బోర్డు సభ్యులందరికీ ఆఖరి టెస్టు సమయంలో వీఐపీ పోడియంలో చూడొచ్చు...

అంతా అనుకున్నట్టే జరిగి ఇండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుని, ఆఖరి టెస్టు సమయానికి 2-0, 3-0 తేడాతో మంచి ఆధిక్యంలో ఉంటే ఒకే కానీ, రిజల్ట్ తేడా కొడితే స్టేడియానికి వచ్చిన రాజకీయ నాయకులు కూడా విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనని అంటున్నారు మీమ్ మేకర్లు.. 

click me!