Ashes: అప్పుడు అశ్విన్-విహారి.. ఇప్పుడు బ్రాడ్-అండర్సన్.. ఏడాది తర్వాత సిడ్నీలో మళ్లీ హై ఓల్టేజీ డ్రామా

By Srinivas MFirst Published Jan 9, 2022, 3:25 PM IST
Highlights

Australia  Vs England: సరిగ్గా ఏడాది క్రితం ఇద్దరు ఆటగాళ్లు  అద్భుతమైన పోరాటంతో ఒక జట్టును ఓటమి నుంచి తప్పించారు. ఇప్పుడు మరో జట్టుకు చెందిన పేస్ ద్వయం.. వరుసగా మూడు పరాజయాల తర్వాత  ఇంగ్లాండ్ ను పరాజయం నుంచి గట్టెక్కించింది. 

అదే గ్రౌండ్.. ఆతథ్యం ఇచ్చింది అదే జట్టు.. ప్రత్యర్థి జట్టు మారింది. కానీ ఫలితం మాత్రం మారలేదు. మజా ఏమాత్రం తగ్గలేదు. ఏడాది  క్రితం అద్భుతమైన పోరాటంతో ఒక జట్టు అద్భుతంగా ఆడి డ్రా తో నిలువగా.. ఇప్పుడు మరో జట్టు వరుసగా మూడు ఓటముల తర్వాత కాస్త ఊరట చెందింది. రెండు జట్లలోనూ ఆఖరు రోజు పోరాడినవాళ్లు కూడా ఇద్దరే కావడం విశేషం. ఆ రెండు జట్లు ఇంగ్లాండ్, ఇండియా.. ఆ రెండు జోడీలలో ఒకటి  టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్-హనుమా విహారి కాగా రెండోది ఇంగ్లాండ్  వెటరన్ పేస్ ద్వయం స్టువర్ట్ బ్రాడ్-జేమ్స్ అండర్సన్. వేదిక సిడ్నీ.. రెండు జట్లకు ప్రత్యర్థి కంగారూలే.. 

అది 2021 జనవరి 11.. ఆసీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు తొలి టెస్టు లో అవమానకర రీతిలో ఓడింది. కానీ రెండో టెస్టులో అనూహ్యరీతిలో పుంజుకుని గెలిచింది. ఇక మూడోదైన సిడ్నీ టెస్టులో ఆసీస్ దెబ్బ తీయడానికి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. తొలి ఇన్నింగ్సులో ఆ జట్టు 338 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి బదులుగా భారత్ చేసింది 244 పరుగులే. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్.. 312-6 (డిక్లేర్డ్) రన్స్ చేసింది. భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

 

For two straight years now, Sydney has seen two dramatic drawn finishes | pic.twitter.com/9GukgC21pO

— ESPNcricinfo (@ESPNcricinfo)

లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్.. 102 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఒకవైపు భీకర పేస్ దాడి కలిగిన ఆసీస్ వికెట్ల  దాహంతో రగిలిపోతుంది.  వారిని తట్టుకుని మరీ టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (97), పుజారా (77) నిలబడ్డారు.  కానీ పుజారాను హెజిల్వుడ్, పంత్ ను లియాన్ ఔట్ చేశాడు. ఇక టీమిండియాకు ఓటమి తప్పదనుకున్నారంతా.. 

అప్పుడే మొదలైంది... 

5 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్లు ఇక లోయరార్డర్ ను పడగొట్టడం పెద్ద కష్టమేమీ కాదనుకున్నారు. అప్పుడే మొదలైంది అసలాట. స్పిన్నర్ రవిచంద్రన్  అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) కలిసి  తెలుగు కుర్రాడు హనుమా విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)  లు అద్భుత పోరాటం చేశారు. మరో వికెట్ పడకుండా వికెట్ల పతనానికి గోడ కట్టారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లే అలసిపోయారు గానీ ఈ ఇద్దరు మాత్రం క్రీజును వీడలేదు. 131 ఓవర్లు ఆడిన టీమిండియా.. 5 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. చివరికి మ్యాచ్ డ్రా గా ముగిసింది. 

సేమ్ సీన్ రిపీట్..

సరిగ్గా ఏడాది తర్వాత.. అదే సిడ్నీ గ్రౌండ్.. అప్పుడు భారత జట్టు ఉన్న పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది. 358 పరుగుల లక్ష్యంలో..  ఐదో రోజు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు కోల్పోయింది.  మిడిలార్డర్ లో బెన్ స్టోక్స్ (60) ఆదుకున్నాడు. ఇక మరో పది ఓవర్లో  మ్యాచ్ ముగుస్తుందనగా..  నిలకడగా ఆడుతున్న బెయిర్ స్టో (40) కూడా నిష్క్రమించాడు. స్టువర్ట్ బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల దాకా పోరాడి మరో  మూడు ఓవర్లు ఆడితే చాలనుకున్న తరుణంలో 9 వ వికెట్ గా జాక్ లీచ్ (26) కూడా నిష్క్రమించాడు. 

అంతే.. ఇంగ్లాండ్ కు నాలుగో ఓటమి తప్పదనుకున్నారంతా.. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అండర్సన్..తన అనుభవన్నంతా రంగరించి ఆరు బంతులను కాపాడుకున్నాడు. ఇంగ్లాండ్ అభిమానులతో పాటు ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు అయితే ఆ ఆరు బంతులు ఆరు యుగాలుగా గడిచాయి. కాగా..  ఏడాది కాలంలో రెండు  కీలక మ్యాచులకు ఆతిథ్యమిచ్చి టెస్టు క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచింది సిడ్నీ.. 

సంక్షిప్త స్కోర్లు : 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 416-8 డిక్లేర్డ్ 
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 294 ఆలౌట్ 
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 265-6  డిక్లేర్డ్ 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 270-9

click me!