Ashes 2021-22: అరంగ్రేటమే అదుర్స్.. తొలి టెస్టులో రిషభ్ పంత్ రికార్డు బీట్ చేసిన ఆసీస్ వికెట్ కీపర్..

By Srinivas MFirst Published Dec 11, 2021, 1:58 PM IST
Highlights

Australia Vs England: ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టిమ్ పైన్ గైర్హాజరీలో వికెట్ కీపింగ్ బాధ్యతలు మోస్తున్న అతడు.. రిషభ్ పంత్  రికార్డును బ్రేక్ చేశాడు. 

బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ టెస్టుతో ఆ జట్టు బౌలర్ నాథన్ లియాన్.. టెస్టులలో నాలుగు వందల వికెట్లు తీసుకున్న మూడో ఆసీస్ బౌలర్ గా రికార్డులకెక్కితే.. ఆ జట్టు తరఫున అరంగ్రేటం చేసిన  వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా యాషెస్ సిరీస్ నుంచి మాజీ కెప్టెన్ టిమ్ పైన్ తప్పుకోవడంతో వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చిన క్యారీ అరంగ్రేట టెస్టులోనే టీమిండియా  వికెట్ కీపర్ రిషభ్ పంత్ రికార్డు బ్రేక్ చేశాడు. 

ఆడుతున్న తొలి టెస్టులోనే కీపర్ గా 8 క్యాచులు పట్టిన వికెట్ కీపర్ గా క్యారీ.. రిషభ్ పంత్ రికార్డును బీట్ చేశాడు. తొలి టెస్టులోనే కీపర్ గా 8 క్యాచ్ లు పట్టిన వికెట్ కీపర్ గా క్యారీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు రిషభ్ పంత్.. 2018 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఎంట్రీ ఇచ్చిన పంత్.. ఏడు క్యాచులు పట్టాడు. ఆ మ్యాచ్ లో భారత్ 203 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. గబ్బాలో జరిగిన తొలి టెస్టులో కూడా ఆసీస్.. ఇంగ్లాండ్ పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు సందర్భాలలో ప్రత్యర్థి ఇంగ్లాండే కావడం మరో విశేషం. 

 

Alex Carey now holds the record for most catches on Test debut 👏 pic.twitter.com/wQExhW1eJO

— 7Cricket (@7Cricket)

పంత్ కంటే ముందు ఈ రికార్డు.. క్రిస్ రిడ్ (ఇంగ్లాండ్), బ్రియాన్ టాబర్ (ఆసీస్), చమర దనుసింఘే (శ్రీలంక), పీటర్ నెవిల్, అలన్ నాట్ లు కూడా తమ తొలి టెస్టులో ఏడు క్యాచ్ లు పట్టిన రికార్డులు సాధించారు.  

తొలి టెస్టు కాకపోయినా టెస్టులలో అత్యధిక డిస్మిస్ లలో భాగం పంచుకున్న వారి జాబితాలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ రసెల్ (11), డివిలియర్స్ (11), పంత్ (11) టేలర్ (10), గిల్క్రిస్ట్ (10) ఉన్నారు. 

కాగా.. వికెట్ కీపర్ గా సూపర్బ్ అనిపించిన క్యారీ బ్యాటింగ్ లో మాత్రం విఫలమయ్యాడు. తొలి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన అతడు.. 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 9 పరుగులే చేసి ఔటయ్యాడు. 

ఇక యాషెస్ సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. మూడో రోజు పటిష్టమైన స్థితిలో నిలిచిన జో రూట్ సేన.. నాలుగో రోజైన శనివారం కుప్పకూలింది.  74 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయి ఆసీస్ కు విజయాన్ని బంగారు పళ్లెంలో అందించింది.  ఇంగ్లాండ్ నిర్దేశించిన 20 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. తాజా విజయంతో యాషెస్ సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

click me!