క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో తెలుగు క్రికెటర్...

By Arun Kumar PFirst Published Jul 31, 2019, 4:15 PM IST
Highlights

ప్రపంచ కప్ వివాదం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి తెలుగు క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై చెప్పిన విషయాన్ని మరువక ముందే మరో తెలుగు క్రికెటర్ కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వైజాగ్ కు చెందిన క్రికెటర్ వేణుగోపాల రావు అంతర్జాతీయ స్థాయిలోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

అంతర్జాతీయ క్రికెట్ కు మరో తెలుగు క్రికెటర్ గుడ్ బై చెప్పాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన క్రికెటర్ వేణుగోపాలరావు క్రికెట్ కు చెందిన అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ పై బిసిసిఐ, ఏసిఏ కు సమాచారం అందించినట్లు వేణుగోపాలరావు పేర్కొన్నాడు.

టీమిండియా తరపున వేణుగోపాలరావు  2006 లో వెస్టిండిస్ తో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడు మళ్ళీ అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇలా దాదాపు 13 సంవత్సరాలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడంతో విసుగుచెందిన అతడు చివరకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లతో పాటు ఐపిఎల్ కు కూడా అతడు గుడ్ బై చెప్పాడు. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆంధ్ర జట్టు తరపున అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న వేణుగోపాల రావు కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అలా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడు ఏకంగా 121 మ్యాచులాడి 7018 పరుగులు చేశాడు. అందులో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే  2000 అండర్ 19 ప్రపంచ కప్ లో అద్భుతంగా ఆడి  భారత విజయంలో కీలకంగా వ్యవహరించిన వేణగోపాలరావు సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత కూడా అతడు అదేస్థాయిలో రాణించడంలో 2006 లో వెస్టిండిస్ తో జరిగిన సీరిస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 

అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాదిరిగా  అంతర్జాతీయ క్రికెట్లో అతడు రాణించలేకపోయాడు. దీంతో కేవలం 11 మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. అందులో అతడు కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీతో 218 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అప్పటి నుండి ఎంత ప్రయత్నించినా అతడికి అంతర్జాతీయ జట్టులో చోటు దక్కలేదు. దీంతో తాజాగా క్రికెట్ నుండి  తప్పుకోవాలని వేణుగోపాలరావు నిర్ణయం తీసుకున్నాడు. 

ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోలేకపోవడంతో మనస్థాపంతో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది జరిగి నెలరోజులు కూడా గడవకముందే మరో తెలుగు క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులను బాధించే అంశమే. 
 
 

click me!