
ఇంగ్లాండ్ గడ్డపై జరిపిన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయినప్పటికి కాలం కలిసిరాక సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యింది. ఇలా లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయిన జట్టు కేవలం ఒక్క ఓటమితో టోర్నీ నుండే నిష్క్రమించాల్సి వచ్చింది. ఇలా హాట్ పేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ట్రోఫీతో కాకుండా ఉత్తచేతులతో స్వదేశానికి తిరిగి రావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మార్పు డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఎలాగూ ఈ ప్రపంచకప్ మిస్సయ్యాం కాబట్టి 2023లో జరిగే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని జట్టును తీర్చిదిద్దాలని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కొందరు సూచిస్తున్నారు. అందుకోసం పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ ను కెప్టెన్ గా, కేవలం టెస్ట్ ఫార్మాట్ కు కోహ్లీని సారథిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వ్యతిరేకించాడు.
టీమిండియా కెప్టెన్ బాధ్యతల నుండి కోహ్లీని తొలగించి రోహిత్ కు అప్పగించాల్సిన అవసరం వుందంటారా..? అని ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా అక్తర్ ను ప్రశ్నించాడు. ''అవసరం లేదు'' అన్న ఒక్క మాటతో అతడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇలా రోహిత్ కంటే కోహ్లీ కెప్టెన్సే టీమిండియాకు అవసరమని అక్తర్ పరోక్షంగా తెలిపాడు.
అయితే కొందరు అభిమానులు మాత్రం అక్తర్ తో విబేధిస్తున్నారు. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ కెప్టెన్సీలోనే అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచింది. అంతేకాకుండా టీమిండియా తరపున కూడా పలు సీరిసుల్లో రోహిత్ సారథిగా వ్యవహరించి విజయాలను అందించాడు. ఇలా కోహ్లీ కంటే అత్యుత్తమ కెప్టెన్ గా నిరూపించుకున్న రోహిత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు వుంటాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.