
టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్టు విరాట్ కోహ్లి ప్రకటించిన నిర్ణయంపై భారత దిగ్గజ క్రికెటర్, టీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన సారథి కపిల్ దేవ్ స్పందించాడు. కోహ్లి నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని చెప్పిన కపిల్ దేవ్.. దీనిని బట్టి చూస్తే కొద్దికాలంగా అతడు తన ఆటను ఆస్వాదించలేకపోతున్నాడని అర్థమవుతున్నదని అన్నాడు. ఇక కోహ్లి ఇగోను వదిలేసి ఆడాలని లేకుంటే అది అతడితో పాటు భారత క్రికెట్ కు కూడా మంచిది కాదని చెప్పుకొచ్చాడు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘టెస్టు కెప్టెన్ గా వైదొలగాలన్న విరాట్ కోహ్లి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. అతడు గతేడాది సెప్టెంబర్ (టీ20 ప్రపంచకప్ సమయంలో) లో టీ20 కెప్టెన్ గా తప్పుకున్నప్పట్నుంచే కఠినమైన సమయాన్ని ఎదుర్కుంటున్నాడు. గత కొద్దికాలంగా అతడు చాలా టెన్షన్ గా ఉంటూ ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. అందుకే కెప్టెన్సీ వదులుకుని స్వేచ్ఛగా ఆడటం అతడికి మంచిదే.. అందుకు అతడు అర్హుడు కూడా..’ అని అన్నాడు.
అంతేగాక.. ‘కోహ్లి పరిణితి గల వ్యక్తి. ఈ నిర్ణయం తీసుకునే ముందు అతడు చాలా ఆలోచించి ఉంటాడు. అతడు తన కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నట్టు లేడని అనిపిస్తోంది. ఈ క్లిష్ట సమయాల్లో మనమంతా అతడికి మద్దతుగా నిలవాలి..’ అని కపిల్ దేవ్ తెలిపాడు.
ఇగోను వదిలేస్తే బెటర్
తనకంటే సీనియర్ అయిన సునీల్ గవాస్కర్ కూడా తన కెప్టెన్సీలో ఆడాడని, అలాగే కోహ్లి కూడా ఇగోను వదిలేసి ఆడాలని కపిల్ సూచించాడు. ‘నా సారథ్యంలో సునీల్ గవాస్కర్ ఆడాడు. నేను కూడా కృష్ణమచారి శ్రీకాంత్ కెప్టెన్సీలో ఆడాను. అంతేగాక అజహరుద్దీన్ నాయకత్వంలో కూడా ఆడాను. నాకు ఎటువంటి ఇగో లేదు. విరాట్ కోహ్లి కూడా తన ఇగో ను వదిలి యువ క్రికెటర్ల సారథ్యంలో ఆడాలి. ఇది అతడితో పాటు భారత క్రికెట్ కు కూడా మంచిది. అంతేగాక విరాట్.. కొత్త ఆటగాళ్లకు, కొత్త సారథికి మార్గ నిర్దేశకుడిగా ఉండాలి. విరాట్ కోహ్లి ని వదులుకోవాలని మాకు లేదు..’ అని కపిల్ దేవ్ సూచించాడు.
ఇదిలాఉండగా.. బుధవారం నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కాబోతున్న వన్డే సిరీస్ లో కోహ్లి.. భారత తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ సారథ్యంలో ఆడనున్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో విరాట్ ఎలా ఆడతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రపంచ క్రికెట్ లో నీపేరు చిరస్థాయిగా నిలుస్తుంది : వివ్ రిచర్డ్స్
విరాట్ కోహ్లి తాజా నిర్ణయంపై విండీస్ క్రికెట్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ కూడా ట్విట్టర్ లో స్పందించాడు. ‘అభినందనలు కోహ్లి.. ఇప్పటిదాకా సాధించినదాని గురించి నువ్వు చాలా గర్వపడొచ్చు. అంతేకాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోని అత్యుత్తమ నాయకులలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది..’ అని ట్వీట్ చేశాడు.