
న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళా జట్టు వరుసగా రెండో పరాజయాన్ని అందుకుంది. ఏకైక టీ20 మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిన భారత మహిళా జట్టు,తొలి వన్డేలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళా జట్టు 48.1 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది...
న్యూజిలాండ్ ఓపెనర్ సూజీ బేట్స్ 111 బంతుల్లో 10 ఫోర్లతో 106 పరుగులు చేయగా మ్యాడ గ్రీన్ 28 బంతుల్లో 17 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. 39 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసిన అమిలియా కేర్‌ను పూనమ్ యాదవ్ బౌల్డ్ చేయగా, 67 బంతుల్లో 4 ఫోర్లతో 63 పరుగులు చేసిన సెతెర్త్‌వేట్, భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి బౌలింగ్‌లో అవుట్ అయ్యింది...
కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ 15 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ కాగా తహుహు 8 పరుగులు, వికెట్ కీపర్ కేటీ మార్టిన్ 6, హల్లీడే 6, జెన్సన్ 6, జెస్సీ కేర్ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వస్తాకర్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా పూనమ్ యాదవ్‌కి ఓ వికెట్ దక్కింది...
276 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత మహిళా జట్టు 213 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన సబ్బినేని మేఘన 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి అవుట్ కాగా షెఫాలీ వర్మ 16 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి అవుట్ అయ్యింది...
యషికా భాటియా 63 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేయగా, కెప్టెన్ మిథాలీ రాజ్ 73 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 22 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ కాగా వికెట్ కీపర్ రిచా ఘోష్ 27 బంతుల్లో ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరింది...
దీప్తి శర్మ 24 బంతుల్లో 16 పరుగులు చేయగా పూజా వస్తాకర్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ 3 పరుగులు చేసి అవుట్ కాగా జులన్ గోస్వామి 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. వన్డే కెరీర్‌లో 67వ 50+ స్కోరు నమోదు చేసిన మిథాలీరాజ్, న్యూజిలాండ్‌పై 1000 పరుగులు చేసిన మొట్టమొదటి భారత బ్యాటర్‌గా నిలిచింది...
న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళా జట్టు ఓ టీ20, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, మొదటి వన్డేలోనూ పోరాడి ఓడింది. భారత్, న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం, ఫిబ్రవరి 15న జరగనుంది. ఈ నెల 24న జరిగే ఆఖరి వన్డేతో కివీస్ టూర్ ముగించుకుని స్వదేశానికి తిరిగి రానుంది భారత మహిళా జట్టు...