ఆఖరి టీ20లో చేతులు ఎత్తేసిన టీమిండియా... ఘన విజయంతో సిరీస్ ముగించిన ఆస్ట్రేలియా...

By Chinthakindhi RamuFirst Published Dec 21, 2022, 10:07 AM IST
Highlights

టీమిండియాతో సిరీస్‌ని 4-1 తేడాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళా జట్టు... ఆఖరి టీ20లో 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన భారత మహిళా జట్టు.. 

టీ20ల్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది ఆస్ట్రేలియా మహిళా జట్టు. రెండో టీ20లో ఆసీస్‌ వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ వేసిన భారత మహిళా జట్టు, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి 4-1 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయింది. నాలుగో టీ20లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన భారత మహిళా జట్టు, చివరి టీ20లో కనీస పోరాటం కూడా చూపకుండానే చేతులు ఎత్తేసింది...  197 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 142 పరుగులకే కుప్పకూలి 54 పరుగుల తేడాతో ఓడింది.

ముంబైలో జరిగిన ఆఖరి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 196 పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. బేత్ మూనీ 2 పరుగులు చేసి అంజలి సర్వాణీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 11, కెప్టెన్ తహిళా మెక్‌గ్రాత్ 26, ఎలీసా పెర్రీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు..

దీంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే అస్‌లీగ్ గాడ్నర్, గ్రేస్ హరీస్ కలిసి ఐదో వికెట్‌కి 129 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి ... ఆస్ట్రేలియాకి భారీ స్కోరు అందించారు. గాడ్రనర్ 32 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 66 పరుగులు చేయగా గ్రేస్ హారీస్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది...

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. స్మృతి మంధాన ఓ ఫోర్ బాది అవుట్ కాగా షెఫాలీ వర్మ 14 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 16 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసి రనౌట్ అయ్యింది...

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 12 పరుగులు, యంగ్ వికెట్ కీపర్ రిచా ఘోష్ 9 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ కాగా దీప్తి శర్మ 34 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసింది. దేవికా వైద్య 11, అంజలి సర్వాణీ 4, రేణుకా ఠాకూర్ సింగ్ 2 పరుగులు చేయగా రాధా యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యింది. 

బ్యాటింగ్‌లో దుమ్మురేపిన గాడ్నర్, బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసింది. హేథర్ గ్రాహమ్ 2 ఓవర్లలో 8  పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది... సిరీస్‌లో 166.67 స్ట్రైయిక్ రేటుతో 115 పరుగులు, 7 వికెట్లు తీసిన గాడ్నర్... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకుంది.. 

click me!