13 కుర్రాడి వీరబాదుడు... 38 సిక్సర్లు, 30 ఫోర్లతో 401 పరుగులతో సెన్సేషన్...

By Chinthakindhi RamuFirst Published Dec 21, 2022, 9:30 AM IST
Highlights

132 బంతులు ఆడి 30 ఫోర్లు, 38 సిక్సర్లు బాదిన తన్మయ్ సింగ్... అండర్ 14 టోర్నమెంట్‌లో రికార్డు పర్ఫామెన్స్‌తో వెలుగులోకి...

ఊర కొట్టుడు, మాస్ కొట్టుడు, దంచి కొట్టుడు అనే పదాలకు అర్థం ఇదేనని నిరూపిస్తూ.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడో 13 ఏళ్ల కుర్రాడు. బంతి పడడమే ఆలస్యం బౌండరీకి పంపిస్తూ, ఫీల్డర్లను ఒక చోట నిలబడకుండా పరుగులు పెట్టించాడు...

అండర్ 14 టోర్నమెంట్‌లో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్‌కి చెందిన 13 ఏళ్ల తన్మయ్ సింగ్ సృష్టించిన విధ్వంసం క్రికెట్ ప్రపంచమంతా మార్మోగుతోంది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న అండర్ 14 క్లబ్ క్రికెట్ బోర్నీలో ర్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో 401 పరుగులతో రికార్డు స్కోరు నమోదు చేశాడు తన్మయ్ సింగ్..

132 బంతులు ఆడిన తన్మయ్ సింగ్, అందులో 30 ఫోర్లు, 38 సిక్సర్లు బాదేశాడు. సిక్సర్లతోనే 228 పరుగులు రాబట్టిన తన్మయ్, ఫోర్లతో 120 పరుగులు చేశాడు. మిగిలిన 53 పరుగులు మాత్రమే సింగిల్స్, డబుల్స్ ద్వారా వచ్చాయి. తన్మయ్‌తో నాన్‌ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న రుద్రా బిదురి కూడా బౌండరీలతో మోత మోగించాడు. 15 ఫోర్లు, 5 ఫోర్లతో 135 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు రుద్ర..

ఈ ఇద్దరి ఊర బాదుడి కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ టీమ్‌ 193 పరుగులకే కుప్పకూలింది. దీంతో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్‌కి 463 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది...

2016 కేసీ గాంధీ ఇంగ్లీష్ స్కూల్ తరుపున ఆడిన ప్రణవ్ ధనవాడే 327 బంతుల్లో 129 ఫోర్లు, 59 సిక్సర్లతో 1009 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించని ప్రణవ్ ధనవాడే, తెరమరుగయ్యాడు... 1000+ పరుగులు చేసిన తర్వాత ప్రణవ్ ధనవాడే క్రికెట్ కెరీర్ ముగిసిపోవడానికి రాజకీయాలే కారణమని ట్రోలింగ్ వినిపించింది.

ప్రణవ్‌ కంటే ముందు స్కూల్ క్లబ్ టోర్నీల్లో సచిన్ టెండూల్కర్- వినోద్ కాంబ్లీ కలిసి 646 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి వెలుగులోకి వచ్చారు. 349 పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ, టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులకే తెరమరుగయ్యాడు. 326 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ ప్రపంచంలో 100 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా తిరుగులేని రికార్డులెన్నో క్రియేట్ చేశాడు...

ముంబై ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా కూడా స్కూల్ క్రికెట్‌లో రికార్డు పరుగులు చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిలో పడ్డవాళ్లే. సర్ఫరాజ్ ఖాన్, హారీస్ షీల్డ్ క్లబ్ తరుపున 439 పరుగులు చేయగా పృథ్వీ షా, హారీస్ కౌంటీ తరుపున 546 పరుగులు చేశాడు. ఈ పర్ఫామెన్స్ తర్వాత అండర్ 19 వరల్డ్ కప్ ఆడిన టీమ్‌కి కెప్టెన్సీ కూడా చేసి, టైటిల్ గెలిచాడు పృథ్వీ షా.. తన్మయ్ సింగ్ వీరిలా నిలకడైన ప్రదర్శనతో స్టార్‌గా వెలుగుతాడో ప్రణవ్‌లా కనిపించకుండా పోతాడో చూడాలి.. 
 

click me!