సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం... చేతుల దాకా వచ్చినా, సఫారీ గడ్డపై ఎక్కడ తప్పు జరిగింది...

By Chinthakindhi RamuFirst Published Jan 15, 2022, 3:17 PM IST
Highlights

టెస్టులు ఆడే ప్రతీ దేశంలోనూ టెస్టు సిరీస్ గెలిచింది భారత జట్టు, ఒక్క సౌతాఫ్రికాలో తప్ప! దాదాపు 30 ఏళ్లుగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే కల, కలగానే మిగిలిపోతోంది... అసలు అక్కడ మనవాళ్లు ఎందుకు గెలవలేకపోతున్నారు...

India vs South Africa: ఈసారి సౌతాఫ్రికా పర్యటనకి ముందు టీమిండియా సూపర్ ఫామ్‌లో ఉండడం, వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచి జోష్‌లో ఉండడంతో ఫెవరెట్లుగా బరిలో దిగింది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ యూనిట్‌తో బరిలో దిగిన భారత జట్టు సౌతాఫ్రికాలో మొట్టమొదటి టెస్టు సిరీస్‌ గెలవడం ఖాయమని అనుకున్నారంతా. 

అనుకున్నట్టుగానే సెంచూరియన్‌లో మొదటి టెస్టు గెలిచి, సౌతాఫ్రికా కంచు కోటను బద్ధలు కొట్టింది. అయితే విరాట్ సేన అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా రెండు టెస్టుల్లో గెలిచి, సిరీస్‌ కైవసం చేసుకుంది సఫారీ జట్టు. 30 ఏళ్ల సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన టీమిండియా, ఆ కల నెరవేర్చుకునేందుకు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే...

ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత మూడింట్లో రెండు టెస్టులు గెలిచి, సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు. ఇప్పుడు వారి స్పూర్తితోనే మొదటి టెస్టు పరాజయం తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి, సిరీస్‌ను కాపాడుకుంది సౌతాఫ్రికా...

పెద్దగా అనుభవం లేని యువ జట్టుతో నిండిన సౌతాఫ్రికా, వరల్డ్ నెం.1 టెస్టు టీమ్‌, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021 రన్నరప్‌ను ఈ విధంగా ఓడించడం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడం ఖాయం...

బ్యాటింగ్ వైఫల్యం...

సౌతాఫ్రికా టూర్‌లో భారత బౌలర్లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ ఒక్కో మ్యాచ్‌లో ఐదేసి వికెట్లతో రాణించారు. అయితే బ్యాట్స్‌మెన్ నుంచి మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ రాలేదు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే ఘోరంగా విఫలమయ్యారు...

అజింకా రహానే ఆరు ఇన్నింగ్స్‌లో 136 పరుగులు మాత్రమే చేస్తే, ఛతేశ్వర్ పూజారా 124 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొదటి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న కెఎల్ రాహుల్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత అతని బ్యాటు నుంచి కూడా సరైన పరుగులు రాలేదు...

రోహిత్ శర్మ గైర్హజరీ కూడా భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, ఒకే హాఫ్ సెంచరీతో 135 పరుగులు మాత్రమే చేశాడు...

క్యాచ్‌ డ్రాప్‌లు, మిస్ ఫీల్డ్...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో సిరీస్‌ విజయాలు సాధించడానికి టీమిండియా ఫీల్డింగ్ నైపుణ్యాలు కూడా కారణం. సౌతాఫ్రికాలో మాత్రం ఆ తరహా పర్ఫామెన్స్ ఇవ్వలేదు భారత ఫీల్డర్లు. చేతుల్లోకి వచ్చిన క్యాచులను డ్రాప్ చేసి, భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా...

సిరీస్ డిసైడర్ కేప్ టౌన్ టెస్టులో 80+ పరుగులు చేసిన కీగన్ పీటర్సన్‌ ఇచ్చిన రెండు క్యాచులను డ్రాప్ చేశాడు ఛతేశ్వర్ పూజారా. సున్నా దగ్గర పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను పూజారా ఒడిసి పట్టి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది...

అశ్విన్ ఫెయిల్యూర్...

సౌతాఫ్రికా పిచ్‌లు స్పిన్నర్లకు ఏ మాత్రం సహకరించవు. ఇది మరోసారి రుజువు చేస్తూ రవిచంద్రన్ అశ్విన్, మూడు మ్యాచుల్లో కలిపి 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. రెండో టెస్టులో చేసిన 46 పరుగులు మినహా, ఈ టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్... అటు బాల్‌తో, ఇటు బ్యాటుతోనూ ఆకట్టుకోలేకపోయాడు...

సఫారీ సూపర్బ్ ఆల్‌రౌండ్ షో...

సెంచూరియన్ టెస్టులో పరాభవం తర్వాత సౌతాఫ్రికా జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. సొంత పిచ్ పరిస్థితులను అద్భుతంగా వాడుకుంటూ చెలరేగిపోయారు సఫారీ బౌలర్లు. తొలి టెస్టు తొలి రోజు మినహా సిరీస్ ఆసాంతం ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు సఫారీ బౌలర్లు...

ముఖ్యంగా స్టార్ పేసర్ ఆన్రీచర్ నోకియా గాయం కారనంగా దూరం కావడంతో జట్టులోని వచ్చిన మార్కో జాన్సెన్, ఏకంగా 18 వికెట్లతో దుమ్మురేపాడు. రెండో టెస్టులో కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ భారాన్ని మోస్తూ, కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటే కుర్ర బ్యాట్స్‌మెన్ కీగన్ పీటర్సన్... బ్యాట్‌తో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు. తొలి టెస్టు తర్వాత సౌతాఫ్రికా కమ్‌బ్యాక్ ఇచ్చిన విధానాన్ని మెచ్చుకుని తీరాల్సిందే...
 

click me!