
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు సెమీస్ చేరింది. నాలుగు మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న భారత జట్టు, గ్రూప్ బీ నుంచి ఇంగ్లాండ్‌తో కలిసి సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచ్ రిజల్ట్‌ని బట్టి... భారత జట్టు, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ ఆడనుందా? లేక వేరే జట్టుతో ఆడనుందా? అనేది తేలనుంది..
ఇప్పుడున్న ఫామ్‌లో పాకిస్తాన్ జట్టు, ఇంగ్లాండ్‌ని ఓడించడం కష్టమే. ఇంగ్లాండ్, పాక్‌పై గెలిస్తే గ్రూప్ బీ నుంచి టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరుతుంది. గ్రూప్ ఏలో రెండో స్థానంలో ఉన్న టీమ్‌తో సెమీస్ ఆడుతుంది. గ్రూప్ బీలో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, గ్రూప్ ఏ టాపర్ ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడాల్సి ఉంటుంది...
టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో నాలుగు గ్రూప్ మ్యాచుల్లోనూ గెలిచి 8 పాయింట్లతో ఉంది ఆస్ట్రేలియా. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన ఆసీస్‌ని ఓడించాలంటే భారత జట్టు తీవ్రంగా శ్రమించాల్సిందే..
2020 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియా చేతుల్లో 85 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మూడేళ్ల క్రితం ఎదురైన ఈ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈసారి సెమీ ఫైనల్‌లో దక్కింది..
అయితే ఆస్ట్రేలియాపై గెలవాలంటే టీమిండియా ఆటతీరులో చాలా మార్పులు అవసరం. ముఖ్యంగా ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్ చేయాలి. ‘షెఫాలీ వర్మ, స్మృతి మంధాన బాగా ఆడారు. అయితే వారి బ్యాటింగ్ నాకైతే అంత సంతృప్తికరంగా అనిపించలేదు. ఈ మ్యాచ్‌కి ముందు వాళ్లు నెట్ సెషన్స్‌లో పాల్గొన్నారు. అయినా ఏదో క్యాచ్ ప్రాక్టీస్‌కి ఇచ్చినట్టుగా క్యాచులు ఇచ్చి అవుట్ అయ్యారు.
10 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నాక ఇలా అవుట్ అవ్వడం కరెక్ట్ కాదు. కనీసం దూకుడుగా బ్యాటింగ్ చేసి ఉంటే స్కోరు అయినా పెరిగి ఉండేది. ఫామ్‌లో లేనప్పుడు వికెట్ కాపాడుకునేందుకు నెమ్మదిగా ఆడాలి. ఫామ్‌లో ఉండి, భారీ షాట్లు ఆడగలిగి ఇలా డాట్ బాల్స్ ఆడడం ఏంటి? ఇదే ప్లాన్‌తో టీమిండియా సెమీస్ ఆడితే చిత్తుగా ఓడిపోవడం గ్యారెంటీ...’ అంటూ హెచ్చరించింది టీమిండియా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా...
బౌండరీల మోత మోగించే షెఫాలీ వర్మ 29 బంతులు ఆడి 3 ఫోర్లతో 24 పరుగులు మాత్రమే చేసింది. షెఫాలీ వర్మ స్ట్రైయిక్ రేటు 82.76 మాత్రమే. స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి 155.36 స్ట్రైయిక్ రేటుతో చెలరేగింది. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 20 బంతులాడి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్లోగా బ్యాటింగ్ చేస్తుందనే కారణంగా ఆమె 2020 టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్ట్రైయిక్ రేటు 65 మాత్రమే. దూకుడుగా ఆడే రిచా ఘోష్ డకౌట్ కావడంతో టీమిండియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినా 155 పరుగులే చేయగలిగింది..
పెద్దగా అనుభవం లేని ఐర్లాండ్ జట్టు, 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. గట్టిగా ఓ రెండు ఓవర్లు ఐర్లాండ్ బ్యాటర్లు బ్యాటుకి పని చెప్పి ఉంటే, మ్యాచ్ రిజల్ట్ తేడా కొట్టి ఉండేది..