
ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. ఇండోర్‌లో జరగాల్సిన మూడో టెస్టుకి వారం రోజుల సమయం ఉండడంతో ఇరు జట్ల ప్లేయర్లకు బ్రేక్ లభించింది. మార్చి 1 నుంచి నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకి ముందు లభించిన బ్రేక్ సమయంలో కొందరు ప్లేయర్లు ఫ్యామిలీతో సమయం గడపడానికి వెచ్చిస్తున్నారు...
తాజాగా భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నాడు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సూర్య. ‘360 డిగ్రీ’ బ్యాట్స్‌మెన్‌గా, ‘ఇండియన్ ఏబీడీ’గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్‌కి దైవ భక్తి కాస్త ఎక్కువే. న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం తిరువనంతపురం వెళ్లినప్పుడు తోటి క్రికెటర్లతో కలిసి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్...
శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో అంతర్జాతీయ టెస్టు ఆరంగ్రేటం చేశాడు సూర్యకుమార్ యాదవ్. 30 ఏళ్లు దాటిన తర్వాత టీమిండియా తరుపున టీ20, వన్డే, టెస్టు ఆరంగ్రేటం చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు సూర్య...
అయితే తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే బ్యాటింగ్‌కి వచ్చిన సూర్య, పెద్దగా మెప్పించలేకపోయాడు. 20 బంతులు ఆడి ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే ఆలౌట్ కావడంతో సూర్యకుమార్ యాదవ్‌కి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కకుండా పోయింది..
శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడంతో రెండో టెస్టులో సూర్యకుమార్ యాదవ్, రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు..
టీ20ల్లో అదరగొడుతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. అయితే టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లోనూ సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం కల్పించింది టీమిండియా మేనేజ్‌మెంట్..
మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు జరగబోతుంటే, ఆ తర్వాత మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆఖరి టెస్టు జరగనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రాబోతున్నట్టు సమాచారం... వచ్చే నెలలో భారత పర్యటనకి వచ్చే ఆసీస్ ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ఆఖరి టెస్టు మొదటి రోజు ఆటను వీక్షించబోతున్నట్టు తెలుస్తోంది..
తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత జట్టు, సిరీస్‌లో 2-0 ఆధిక్యం సంపాదించింది. 2017 సీజన్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాని ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత 2018-19, 2020-21 సీజన్లలో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించి టైటిల్ గెలిచింది. వరుసగా నాలుగు సీజన్లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా ఆసీస్‌పై తిరుగులేని ఆధిపత్యం దక్కించుకుంది టీమిండియా..