
రాబోయే కొద్ది రోజుల్లో భారత క్రికెట్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) రాకతో ఆ ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World cup) తర్వాత పొట్టి ఫార్మాట్ సారథ్య బాద్యతల నుంచి తప్పుకోనున్నట్టు తెలిపిన విరాట్ కోహ్లి (Virat Kohli).. తాజా టీమిండియా ప్రదర్శన కారణంగా వన్డే కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు.
విరాట్ వన్డే కెప్టెన్సీ పై మరో వారం రోజుల్లో బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ నిర్ణయం వెల్లడించనున్నది. టీ20 సారథ్య పగ్గాలు చేపట్టనున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. వన్డే బాధ్యతలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం. అయితే వన్డే బాధ్యతలతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా విరాట్ ను తప్పించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై కొత్త కోచ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితుడైన విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగంగా.. బీసీసీఐ (BCCI) అడ్వైజరీ కమిటీ అతడిని ఓ ఆసక్తికర ప్రశ్న అడుగగా ద్రవిడ్ కూడా అలాంటి సమాధానమే ఇచ్చాడు. ‘భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు..?’ అని ద్రవిడ్ ను అడగగా అతడు తడుముకోకుండా ‘రోహిత్ శర్మ ’ అని సమాధానం ఇచ్చాడట. టెస్టులకూ రోహిత్ ను కెప్టెన్ గా.. కెఎల్ రాహుల్ (KL Rahul) ను వైస్ కెప్టెన్ గా నియమిస్తే బావుంటుందని ద్రవిడ్ చెప్పినట్టు బోర్డు వర్గాల విశ్వసనీయ సమాచారం.
రోహిత్ శర్మ.. ప్రస్తుతం భారత టీ20, వన్డే లకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. విరాట్ లేని సమయాల్లో అతడే సారథ్య బాధ్యతలు చూస్తున్నాడు. టెస్టుల్లో మాత్రం రహానే వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడి సారథ్యంలోనే గతేడాది టీమిండియా.. ఆసీస్ తో సిరీస్ కూడా నెగ్గిన విషయం తెలిసిందే. ఇక వన్డేలలో రోహిత్ సారథిగా ఉంటే కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్నాడు. ఇప్పుడు ఈ జంటనే కెప్టెన్-వైస్ కెప్టెన్ గా నియమిస్తే బావుంటుందని ద్రవిడ్ చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే విరాట్ ను టెస్టు సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పించడమా..? లేక ఆసీస్, ఇంగ్లండ్ లో మాదిరి టెస్టులకు ఒక కెప్టెన్, టీ20 వన్డేలకు మరో కెప్టెన్ ను పెడితే ఎలా ఉంటుందా..? అని బీసీసీఐ పెద్దలు చర్చోపచర్చలు చేస్తున్నారు. ఏదేమైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) త్వరలోనే దీనిపై రానున్న కొద్ది రోజుల్లో తుది నిర్ణయం వెల్లడించనున్నది.
ఇక టెస్టులలో విరాట్ కోహ్లికి ఆటగాడిగానే గాక కెప్టెన్ గా కూడా మంచి రికార్డు ఉంది. 2014 నుంచి టెస్టులకు కెప్టెన్ గా ఉన్న విరాట్.. ఇప్పటివరకు 65 టెస్టులకు సారథిగా ఉన్నాడు. అందులో భారత్ 38 మ్యాచ్ లు గెలిచి 16 ఓడిపోయింది. సారథిగా అతడి విజయాల శాతం 58.46 గా ఉంది. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (62.33 శాతం), ప్రస్తుత కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (59.45 శాతం) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. మరి ఘనమైన రికార్డులు కలిగిన విరాట్ ను కాదని టెస్టు కెప్టెన్ బాధ్యతలను కూడా రోహిత్ కే అప్పజెప్పుతారా..? లేదా విరాట్ ను కొనసాగిస్తారా..? అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ మొదటిదే జరిగితే మాత్రం కోహ్లికి ఊహించని షాకే అవుతుందని అతడి అభిమానులు భావిస్తున్నారు.