టీమిండియాకి దెబ్బ మీద దెబ్బ... స్లో ఓవర్ రేటు కారణంగా 80 శాతం కోసేసిన ఐసీసీ...

By Chinthakindhi RamuFirst Published Dec 5, 2022, 5:12 PM IST
Highlights

ఓవర్ రేటుకి నాలుగు ఓవర్లు తక్కువగా వేసిన భారత జట్టు... ఏకంగా 80 శాతం మ్యాచ్ ఫీజును కోత విధిస్తున్నట్టు ప్రకటించిన ఐసీసీ...

బంగ్లాదేశ్ టూర్‌లో తొలి వన్డేలో బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యి 1 వికెట్ తేడాతో పరాజయాన్ని చవిచూసిన టీమిండియాకి మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. సాధారణంగా షెడ్యూల్ సమయానికి ఓవర్లు పూర్తి చేయలేకపోతే 20 శాతం మ్యాచ్ ఫీజుని పెనాల్టీని విధిస్తారు. అయితే తొలి వన్డేలో టీమిండియా... ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో తక్కువ వేసిన ఒక్కో ఓవర్‌కి 20 శాతం లెక్కన 80 శాతం మ్యాచ్ ఫీజును కోత విధించింది ఐసీసీ..

స్లో ఓవర్ రేటు వేసినందుకు రిఫరీకి క్షమాపణలు తెలిపిన రోహిత్ శర్మ, మ్యాచ్ ఫీజు కోతకి అంగీకరించాడు.  ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడం జరుగుతుంది. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే, టీమిండియా నెట్ ఓవర్ రేటుకి ఏకంగా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్టు గుర్తించారు...’ అంటూ అధికారిక స్టేట్‌మెంట్ విడుదల చేసింది ఐసీసీ...

అంటే ఇండియా, బంగ్లాదేశ్ మొదటి వన్డే ఆడిన జట్టు ప్లేయర్లు కేవలం 20 శాతం మ్యాచ్ ఫీజు మాత్రమే అందుకోబోతున్నారు. ఢాకాలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా... ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బౌలింగ్‌కి చక్కగా సహకరిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు కూడా చక్కగా రాణించారు...

దీంతో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బంగ్లాదేశ్. మరో వికెట్ తీస్తే చాలు, టీమిండియాదే విజయం అనుకుంటున్న సమయంలో మెహిడీ హసన్, ముస్తాఫిజుర్ రహ్మన్ కలిసి 10వ వికెట్‌కి 51 పరుగులు జోడించి... బంగ్లాకి చారిత్రక విజయాన్ని అందించారు. 2019లో కెప్టెన్‌గా బంగ్లాదేశ్‌పై టీ20 మ్యాచ్‌ ఓడిపోయిన రోహిత్ శర్మ, వన్డే మ్యాచ్‌లోనూ పరాజయాన్ని చవిచూశాడు. బంగ్లాదేశ్‌పై టీ20, వన్డేల్లో ఓటమి చవిచూసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్...

ఇరు జట్ల మధ్య బుధవారం, డిసెంబర్ 7న రెండో వన్డే జరగనుంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిన భారత జట్టు, మిగిలిన రెండు వన్డేల్లో గెలిచి సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్, రోహిత్ సేనపై కూడా ఇదే రిజల్ట్‌ని రిపీట్ చేయాలని భావిస్తోంది..

click me!