విజయానికి ఐదు వికెట్ల దూరంలో ఇంగ్లాండ్.. డ్రా కోసం పాక్ ఆపసోపాలు..

By Srinivas MFirst Published Dec 5, 2022, 3:04 PM IST
Highlights

PAK vs ENG: పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ తొలి టెస్టులో గెలిచేందుకు  సర్వశక్తులూ ఒడ్డుతోంది.  బౌలింగ్ కు అనుకూలించని పిచ్ పై  వికెట్లు తీస్తూ పాక్ పై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు ఈ టెస్టును ఎలాగైనా డ్రా చేసుకోవాలని పాక్ కూడా పోరాడుతోంది. 

రావల్పిండి వేదికగా పాకిస్తాన్- ఇంగ్లాండ్ నడము జరుగుతున్న తొలి టెస్టు ఫలితం తేలే దిశగా కదులుతోంది.  పాక్ ముందు 343 పరుగుల లక్ష్యాన్ని నిలిపి  రోజున్నర టైమ్ ఇచ్చిన ఇంగ్లాండ్..  ఇప్పటికే ఐదు  కీలక వికెట్లను తీసి ఆ జట్టను  తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.  ప్రస్తుతం  ఆడుతున్న అజర్ అలీ, అగా సల్మాన్ ల మీదే పాకిస్తాన్ ఆశలు పెట్టుకుంది.  ఈ ఇద్దరూ ఔటైతే  పాక్ కు ఓటమి తప్పేలా లేదు. 

343 పరుగుల లక్ష్యంలో పాకిస్తాన్  73  ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. సౌద్ షకీల్ (159 బంతుల్లో 76, 12 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (92 బంతుల్లో 46, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)  పాక్ ఇన్నింగ్స్ ను నిలబెట్టడానికి యత్నించినా  ఇంగ్లాండ్ బౌలర్లు ఈ ఇద్దరినీ  పెవిలియన్ కు పంపారు. 

ఆదివారం లంచ్ తర్వాత  ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి పాక్ కు బ్యాటింగ్ అప్పగించింది ఇంగ్లాండ్. ఇంకా ఐదు సెషన్ల ఆట ఉండీ అదీ బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై  ఇటువంటి నిర్ణయం తీసుకోవడం  అందరినీ ఆశ్చర్యపరిచినా  బెన్ స్టోక్స్ మాత్రం ధైర్యంగా ముందడగు వేశాడు. అయితే ఆదివారమే ఆ జట్టు  ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (6)  తో పాటు బాబర్ ఆజమ్ (4) వికెట్లను కోల్పోయింది.  అజర్ అలీ రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు.  

సోమవారం ఆట ప్రారంభయ్యాక  కొద్దిసేపటికి ఇమామ్ ఉల్ హక్ (48) ను జేమ్స్ అండర్సన్ ఔట్ చేశాడు.  ఇమామ్.. షకీల్ తో కలిసి 63 పరుగులు జోడించాడు. ఆ తర్వాత షకీల్.. రిజ్వాన్ తో కలిసి నాలుగో వికెట్ కు 87 పరుగులు జోడించాడు. కానీ  అండర్సన్ మరోసారి ఇంగ్లాండ్ కు బ్రేక్ ఇచ్చాడు. లంచ్ తర్వాత రిజ్వాన్ ను అండర్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షకీల్ ను రాబిన్సన్ బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.  

ఇంగ్లాండ్ విజయానికి ఐదు వికెట్లు అవసరముండగా  పాక్  గెలపునకు మరో సెషన్ ఆటలో 105 పరుగులు కావాలి.  కానీ పాక్ ఆట చూస్తే ఆ జట్టు గెలిచే దిశగా ఆడటం లేదు. దుర్వేధ్యమైన డిఫెన్స్ తో మ్యాచ్ ను డ్రా చేసుకునే దిశగా  అజర్ అలీ, అగా సల్మాన్ ఆడుతున్నారు. 

 

He does it again (and again, and again)

Big moment in the game!

Scorecard: https://t.co/NXmzHdyArp

🇵🇰 🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 pic.twitter.com/cWewRmV9hT

— England Cricket (@englandcricket)

సంక్షిప్త స్కోరు వివరాలు : 

ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్ లో 657 ఆలౌట్ 
పాకిస్తాన్ : తొలి ఇన్నింగ్స్ లో  579 ఆలౌట్ 
ఇంగ్లాండ్ : రెండో ఇన్నింగ్స్ లో 264 -7 డిక్లేర్డ్ (పాక్ ఎదుట 343 పరుగుల లక్ష్యం)  
పాకిస్తాన్ :  రెండో ఇన్నింగ్స్ లో 73 ఓవర్లు ముగిసేసరికి  242-5 (గెలవాలంటే 101 పరుగులు చేయాలి) 
 

click me!