
ప్రముఖ గాయకుడు కేకే మృతి పట్ల దేశవ్యాప్తంగా సంగీత ప్రేమికుల్లో విచారం నెలకొంది. కోల్కతా లోని ఓ కాలేజీ వేడుకకై హాజరైన అతడు.. పాడుతూనే అస్తమించాడు. కాగా, అతడి అకాల మృతిపై టీమిండియా క్రికెటర్లు కూడా షాక్ కు గురయ్యారు. తన పాటలతో దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరించిన కేకే మృతి చిత్రసీమకే గాక సంగీత అభిమానులకూ తీరని లోటని పేర్కొన్నారు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, వసీం జాఫర్ లు ట్విటర్ లో తమ సంతాప సందేశాలు తెలిపారు.
ట్విటర్ వేదికగా కోహ్లి స్పందిస్తూ.. ‘మన కాలంలో అద్భుతమైన సింగర్ ను కోల్పోయాం. కేకే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి..’ అని రాసుకొచ్చాడు. టీమిండియా మాజీ సారథి, లెగ్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. ‘కేకే మరణం తీవ్రంగా కలిచివేసింది. అతడి కుటుంబానికి నా సానుభూతి...’ అని పేర్కొన్నాడు.
‘కేకే మరణించాడన్న వార్త విషాదకరం. జీవితం ఎంత దుర్బలంగా ఉంటుందో తెలియజెప్పడానికి కేకే మరణం ఓ ఉదాహరణ. అతడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలుపుతున్నాను..’ అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కు చీఫ్ గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.. ‘కేకే అద్భుతమైన గాయకుడు. అతడి అకాల మరణం బాధాకరం. తన సంగీతం ద్వారా కేకే ఎప్పటికీ జీవించి ఉంటాడు. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి. ఓం శాంతి’ అని రాసుకొచ్చాడు.
‘కేకే మరణవార్త విన్నాక షాక్ కు లోనయ్యా. అతడి భావపూరిత, మెలోడీ పాటలు ఎన్నో లక్షలాది మంది అభిమానుల హృదయాలను తాకాయి. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి..’ అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.
కాగా కోల్కతాలోని ఓ కాలేజీ వేడుకకు హాజరైన కేకే.. దాదాపు గంట పాటు స్టేజ్ పై పాడి అప్పుడే అస్వస్థతకు గురి కావడంతో హోటల్ కు చేరుకున్నాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. ఢిల్లీకి చెందిన కేకే హిందీతో పాటు తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, బెంగాలీ వంటి స్థానిక భాషల్లోనూ పాటలు పాడి అభిమానులను సంపాదించుకున్నారు.