గాయం సాకుతో బంగ్లా టూర్‌కి ఎగనామం.. భార్య కోసం ప్రచారం, జడేజాపై ఫ్యాన్స్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Nov 26, 2022, 3:38 PM IST
Highlights

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా చిక్కుల్లో పడ్డారు. గాయం కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు దూరమైన ఆయన.. విశ్రాంతి తీసుకోకుండా తన భార్య రివాబా కోసం ప్రచారం చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో నార్త్ జామ్ నగర్ నుంచి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా తీరు వివాదాస్పదమవుతోంది. వచ్చే నెలలో జరగనున్న బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన జడేజా గాయం నుంచి కోలుకోలేదంటూ ఆ పర్యటనకు దూరమయ్యాడు. అయితే అతని భార్య రివాబా గుజరాత్ ఎన్నికల్లో నార్త్ జామ్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆమె కోసం ప్రచారం చేయడానికే బంగ్లాదేశ్ టూర్‌కి జడ్డూ ఎగనామం పెట్టాడనే విమర్శలు వస్తున్నాయి. అలాగే జడేజా ఇండియా జెర్సీతో వున్న ఫోటోలతో బీజేపీ కరపత్రాలను ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కాగా... గత సోమవారం రివబా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా ఆమె పక్కనే వున్నారు. తన భార్య ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తుందని.. రివబాకు ప్రజాసేవ అంటే ఇష్టమని, అందుకే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని జడేజా అన్నారు. తన భార్యకు ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Also Read:బంగ్లాదేశ్ పర్యటనకు సీనియర్లు, భారత్ ‘‘ఏ’’ జట్టు ఇదే.. జడేజా, యాష్ దయాల్‌ ఔట్

కాంగ్రెస్ నాయకుడు  హరి సింగ్ సోలంకికి బంధువైన రివాబా.. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019లో బీజేపీలో చేరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. రాజ్‌పుత్‌ల అనుబంధ సంస్థ  కర్ణి సేనలో ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గుజరాత్‌లో కీలకంగా ఉండే కుల సమీకరణాల  దృష్ట్యా రాజ్‌పుత్ వర్గం  ఓట్లను ఆకర్షించడానికి రివాబాకు బీజేపీ టికెట్ ఇచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇకపోతే.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 మంది పేర్లతో కూడిన జాబితాను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ జాబితాలో రివాబా జడేజా పేరు కూడా ఉంది. ఆమె  జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ తరఫున బరిలో నిలవననున్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీకే చెందిన ధర్మేంద్రసింగ్ జడేజా ఉన్నారు. అయితే ఈ సారి ఆ స్థానం నుంచి రివాబా జడేజాను బీజేపీ బరిలో నిలపాలని నిర్ణయం తీసుకుంది. 

click me!