కలలు నిజమౌతాయి : సొంత వూరిలో క్రికెట్ గ్రౌండ్ నెలకొల్పిన టీమిండియా బౌలర్

Published : Dec 15, 2021, 06:50 PM ISTUpdated : Dec 15, 2021, 06:54 PM IST
కలలు నిజమౌతాయి : సొంత వూరిలో క్రికెట్ గ్రౌండ్ నెలకొల్పిన టీమిండియా బౌలర్

సారాంశం

T. Natarajan: చిన్నప్పుడు తనకు క్రికెట్ నేర్చుకోవడంలో ఎదురైన కష్టాలు.. వేరేవ్వరూ పడకూడదని భావించి.. ఏకంగా తన సొంత వూర్లోనే క్రికెట్ గ్రౌండ్ నెలకొల్పాడు నట్టూ.. అతడి కల నెరవేరగానే మిగతా వాళ్ల కలలను  తీర్చడానికి తన వంతు సాయం చేస్తున్నాడు. 

భారత మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం చెప్పినట్టు.. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి..’ అంటున్నాడు  టీమిండియా యువ బౌలర్ టి. నటరాజన్. తమిళనాడులోని మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి టీమిండియా బౌలర్ స్థాయికి ఎదిగిన ఈ  యార్కర్  స్పెషలిస్ట్..  తాను పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని గొప్ప ఆశయంతో ముందుకు సాగుతున్నాడు. చిన్నప్పుడు తనకు క్రికెట్ నేర్చుకోవడంలో ఎదురైన కష్టాలు.. వేరేవ్వరూ పడకూడదని భావించి.. ఏకంగా తన సొంత వూర్లోనే క్రికెట్ గ్రౌండ్ నెలకొల్పాడు. అది కూడా సకల సౌకర్యాలతో.. ఈ విషయాన్ని స్వయంగా అతడే  వెల్లడించాడు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన నటరాజన్.. ‘నా సొంత గ్రామంలో  సకల సౌకర్యాలతో క్రికెట్ గ్రౌండ్ ను నెలకొల్పానని తెలపడానికి సంతోషంగా ఉంది.  దీని పేరును నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ (ఎన్సీజీ) గా నిర్ణయించాం...’ అని పేర్కొన్నాడు.

 

అంతేగాక ‘కలలు నిజమౌతాయి. గతేడాది డిసెంబర్ లో నేను ఆసీస్  పర్యటనలో నేను అరంగ్రేటం చేశాను. ఈ ఏడాది అదే డిసెంబర్ లో నా సొంత వూర్లో క్రికెట్ గ్రౌండ్ ను నెలకొల్పాను.. దేవుడికి కృతజ్ఞతలు..’ అని పోస్ట్ చేశాడు.  తన సొంత డబ్బులతో పాటు మిత్రుల సాయంతో  నటరాజన్ ఈ గ్రౌండ్ ను నెలకొల్పాడు. 

తమిళనాడులోని సేలం జిల్లాకు చిన్నప్పంపట్టి గ్రామంలో పుట్టిన నటరాజన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడటానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన నటరాజన్.. ఎన్నో కష్టాలకు ఓర్చి  అంచెలంచెలుగా ఎదిగాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున ఆడి  రాణించడంతో బీసీసీఐ సెలక్టర్ల కన్ను  నటరాజన్ మీద పడింది. 

ఇదీ చదవండి : రెండేండ్లుగా మొత్తుకుంటున్నా నమ్మరేంట్రా బాబు? హిట్ మ్యాన్ తో విభేదాలపై కోహ్లీ క్రిస్టల్ క్లీయర్ రిప్లై

గతేడాది డిసెంబర్ లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన నటరాజన్..  టీమిండియా నెట్ బౌలర్ గా ఎంపికయ్యాడు. కానీ అనూహ్యంగా తుది జట్టులో కూడా చోటు దక్కించుకుని  ఆస్ట్రేలియా పిచ్ ల మీద కంగారూలకు తన యార్కర్ల రుచి చూపించాడు. ఆసీస్ తో జరిగిన వన్డే మ్యాచ్  ద్వారా అరంగ్రేటం చేసిన నట్టూ.. ఆ తర్వాత టీ20, గబ్బా టెస్టులో కూడా ఆడాడు. ఆ పర్యటనలో మొత్తంగా మూడు టెస్టులు, రెండు వన్డేలు, ఆరు టీ20లలో 11 వికెట్లు పడగొట్టాడు. కానీ  ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అతడు గాయం కారణంగా ఒక్క టెస్టు  కూడా ఆడకుండానే స్వదేశానికి పయనమయ్యాడు. ఇక  ఐపీఎల్ రెండో అంచెకు ముందు కూడా కరోనా బారిన పడటంతో  ఆ టోర్నీ నుంచి కూడా నట్టూ నిష్క్రమించాల్సి వచ్చింది. 

ఏదేమైనా క్రికెట్ లో కొంత సంపాదించగానే యాడ్స్, ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తూ వ్యాపారాలు నెలకొల్పుతున్న ఈ రోజుల్లో నటరాజన్ మాత్రం అందుకు విరుద్ధంగా.. తాను పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని సొంత డబ్బుల్తో మారుమూల ప్రాంత క్రికెటర్లకు మద్దతుగా నిలవడం నిజంగా స్ఫూర్తిదాయకం. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !