నా ప్రమేయమేమీ లేదు... రోహిత్ ను పక్కన పెట్టమన్నది,పెట్టింది ఎవరంటే: రవిశాస్త్రి

Arun Kumar P   | Asianet News
Published : Nov 02, 2020, 08:35 AM IST
నా ప్రమేయమేమీ లేదు... రోహిత్ ను పక్కన పెట్టమన్నది,పెట్టింది ఎవరంటే: రవిశాస్త్రి

సారాంశం

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయకపోవడంలో వివాదం రేగుతున్న సమయంలో కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 

ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఆసీస్ సిరీస్‌కి ఎంపిక చేయకపోవడంపై వివాదానికి దారితీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపిఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అతడు గాయం కారణంగా ప్రస్తుతం మ్యాచులకు దూరంగా వుంటున్నాడు. అయితే అతడికి తగిలిన గాయం అంత పెద్దది కాకపోయినా, ఆ వంకతో స్టార్ ప్లేయర్‌ను ఆసీస్ సిరీస్‌కి దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో టీమిండియా కోచ్ రవిశాస్త్రి తాజాగా ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.  

రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేయకపోవడంలో ఎవరి ప్రమేయం లేదని... కేవలం డాక్టర్ల సూచన మేరకే సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు రవిశాస్త్రి వెల్లడించారు. ప్రస్తుతం గాయం కారణంగా మైదానానికి దూరమైన రోహిత్ ను తొందరపడి బరిలోకి దింపితే మళ్లీ గాయపడే ప్రమాదముందని... అందువల్ల పూర్తిస్థాయిలో విశ్రాంతి ఇవ్వాలని డాక్టర్ బృందం నివేదిక సమర్పించిందన్నారు. ఈ వైద్య బృందం నివేదిక ఆధారంగానే రోహిత్ ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని రవిశాస్త్రి స్పష్టం చేశారు. 

read more  రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై అనుమానాలు... ‘హిట్‌మ్యాన్’ను పరీక్షించనున్న బీసీసీఐ...

''నేను టీమిండియా కోచ్ ని మాత్రమే. ఆటగాళ్ళ ఎంపిక ప్రక్రియలో నా ప్రమేయమేమీ వుండదు. ఈ ప్రక్రియను చేపట్టేది సెలెక్టర్లు మాత్రమే. వారే వైద్యబృందం సూచన మేరకే రోహిత్ కు మరికొంత కాలం విశ్రాంతి అవసరమని నిర్ణయించారు. అందువల్లే ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపికచేసిన భారత జట్టులో చోటు కల్పించలేదు'' అన్నారు రవిశాస్త్రి. 

వైద్యుల సూచన ప్రకారం రోహిత్ గాయం నుండి పూర్తిగా కోలుకునే వరకు మైదానానికి దూరంగా వుండాలని రవిశాస్త్రి సూచించారు. ఇది కేవలం కోచ్ గానే కాకుండా స్వీయ అనుభవంతో చెబుతున్నానని అన్నారు.  1991లో గాయంతో బాధపడుతున్న తాను వైద్యులు వద్దని చెప్పినా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని... దీంతో అక్కడితో కెరీర్ ముగించాల్సి వచ్చిందన్నారు. వైద్యులు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకుని వుంటే మరో ఐదారేళ్లు టీమిండియాకు సేవలు అందించేవాడినన్నారు. అలాంటి తొందరపాటు నిర్ణయం రోహిత్ తీసుకోవద్దని రవిశాస్త్రి సూచించారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు