భారత్ చీఫ్ సెలెక్టర్ రేస్: ప్రసాద్ వెళ్లినా.... మళ్ళీ వచ్చేది ప్రసాదే!

By telugu teamFirst Published Jan 26, 2020, 5:34 PM IST
Highlights

సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎవరనేది ఇంకా తేలలేదు. దాని గురించి బీసీసీఐ మల్లగుల్లాలు పడుతుంది. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌లు చీఫ్‌ సెలక్టర్‌ రేసులో ఉన్నారు. 

చూస్తుండగానే తెలుగువాడయిన చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ పదవీకాలం ముగిసింది. అతడు ఆ పదవిని చేపట్టి అప్పుడే మూడు సంవత్సరాలు దాటిందా అనే ఆశ్చర్యం మాత్రం కలుగక మానదు. అయితే ఇప్పుడు ప్రసాద్ ఆ పదవిలోంచి దిగిపోయినా మరో ప్రసాద్ ఆ పదవిలోకి వచ్చే విధంగా కనబడుతున్నాడు. 

ఎమ్మెస్కే ప్రసాద్‌ 40 నెలల చీఫ్‌ సెలక్టర్‌ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. సెంట్రల్‌ జోన్‌ సహచరుడు గనన్‌ ఖోడాతో కలిసి ప్రసాద్‌ సెలక్షన్‌ కమిటీ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. 

సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ తదుపరి చీఫ్‌ సెలక్టర్‌ ఎవరనేది ఇంకా తేలలేదు. దాని గురించి బీసీసీఐ మల్లగుల్లాలు పడుతుంది. మాజీ క్రికెటర్లు లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌లు చీఫ్‌ సెలక్టర్‌ రేసులో ఉన్నారు. 

సెలక్షన్‌ కమిటీలోని రెండు ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు జనవరి 24తో ముగిసింది. జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ సెలక్టర్‌గా పనిచేసిన వెంకటేశ్‌ ప్రసాద్‌ చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపికైతే నిబంధనల ప్రకారం ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగగలడు. 

Also read; వికెట్ల వెనుక రాహుల్.... మరో ధోనిని తలపిస్తున్నాడోచ్!

నిబంధనల ప్రకారం బీసీసీఐ ఏ కమిటీలోనైనా ఐదేండ్లకు మించి ఏక కాలంలో పనిచేయకూడదు. 2015-2018లో జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగిన ప్రసాద్‌, నిబంధనల ప్రకారం 2021లోనే తప్పుకోవాలి. 

అదే లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ విషయానికి వచ్చేసరికి అతడు మూడేండ్ల పాటు కొనసాగే ఆస్కారం ఉంది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలో మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. 

దీంతో ప్రసాద్‌కు సైతం ఏడాది కాల వ్యవధితో చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తే 2021లో పూర్తి సెలక్షన్‌ కమిటీని నూతనంగా ఎంచుకునే వీలుంటుందని బీసీసీఐ బాస్‌ గంగూలీ భావనగా తెలుస్తోంది. 

Also read: పంత్ భవితవ్యంపై నీలి నీడలు... వాట్ నెక్స్ట్...?

సోమవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్న ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మీటింగ్ సందర్భంగా  సభ్యులను ప్రకటించే వీలుంది. జనవరి 27న క్రికెట్ అడ్వయిజరి కమిటీ సమావేశమయితే... మంగళవారం నాటికి చీఫ్‌ సెలక్టర్‌ను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

గతంలో లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఈ పోస్టుకు రేసులో ముందున్నప్పటికీ... సౌరవ్ గంగులు బీసీసీఐ ప్రెసిడెంట్ అయినా తరువాత మాత్రం వెంకటేష్ ప్రసాద్ వైపుగా అనుకూల పవనాలు వీస్తున్నాయి. బహుశా గంగూలీతో ఉన్న పర్సనల్ రేలషన్ కూడా దీనికి ఒక కారణం కాబోలు....!

click me!