భవిష్యత్ పంత్ దే... వికెట్ కీపింగ్, బ్యాటింగే కాదు అందులోనూ ధోనీ స్టైలే...: కోహ్లీ

By Arun Kumar PFirst Published Aug 7, 2019, 3:19 PM IST
Highlights

వెస్టిండిస్ తో జరిగిన టీ20 సీరిస్ ను టీమిండియా క్లీన్  స్వీప్ చేసింది. చివరి టీ20 లో  అయినా గెలిచి పరువు నిలుపుకోవాలన్న విండీస్ ఆశలపై విరాట్  కోహ్లీ, రిషబ్ పంత్ లు నీళ్లు చల్లారు. 

వెస్టిండిస్ తో జరిగిన మూడు టీ20ల సీరిస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ప్లోరిడాలో జరిగిన రెండు మ్యాచులతో పాటు గయానా లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. అయితే మొదటి రెండు వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రిషబ్ పంత్ మూడో టీ20లో మాత్రం అద్భుతం చేశాడు. కోహ్లీతో కలిసి సెంచరీ పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల  వర్షం కురిపించాడు. 

మూడో టీ20 విజయం తర్వాత జరిగిన అవార్డుల  ప్రదానోత్సవ కార్యక్రమంలో కోహ్లీ  మాట్లాడాడు. ఈ  మ్యాచ్ హాఫ్ సెంచరీతో(65 పరుగులు) చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన పంత్ ను అతడు కొనియాడాడు. పంత్ మంచి బ్యాటింగ్ నైపుణ్యం, ప్రతిభ కలిగిన ఆటగాడంటూ ప్రశంసించాడు. ధోని మాదిరిగానే అతడు మంచి బ్యాట్స్ మెన్, వికెట్ కీపర్ మాత్రమే కాదు అత్యుత్తమ  మ్యాచ్ ఫినిషర్ కూడా. ఈ మ్యాచ్ లో అతడు చివరి  వరకు నాటౌట్  గా నిలిచి జట్టును గెలిపించిన విధానమే అందుకు   నిదర్శనం అని కోహ్లీ ప్రశంసించాడు. 

చివరి టీ20లో విండీస్ టాప్ ఆర్డర్ ను బెంబేలెత్తించిన దీపక్ చాహర్ ను కూడా కోహ్లీ కొనియాడాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ మాదిరిగానే చాహర్ కూడా కొత్త బంతితో అద్భుతాలు చేయగలడు. ఈ మ్యాచ్ ద్వారా అందరికీ  ఆ విషయం అర్థమైవుంటుంది. కొత్త బంతి నుండి స్వింగ్ ను ఎలా రాబట్టాలో అతడికి బాగా తెలుసు. అంతర్జాతీయ క్రికెట్ లో మంచి  నైపుణ్యమున్న బౌలర్లలో అతడొకడు.'' అని కోహ్లీ అన్నాడు. 

 గయానా వేదికన జరిగిన చివరి టీ20 మ్యాచులో కూడా టీమిండియా అన్ని విభాగాల్లో ఆదిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్ మొదట బౌలింగ్ లో దీపక్ చాహర్...ఆ తర్వాత లక్ష్యఛేదనలో కెప్టెన్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టారు. చాహర్ విండీస్ కు చెందిన ముగ్గురు టాప్ ఆర్డర్ వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 27పరుగులకే ఓపెనర్లిద్దరికి కోల్పోయి క్లిష్ట సమయంలో వున్నపుడు కోహ్లీ(59 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి రిషబ్ పంత్(65 పరుగులతో నాటౌట్) తోడవడంతో భారత్ మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20  సీరిస్ టీమిండియా వశమయ్యింది. 

click me!