జింబాబ్వేని బెంబేలెత్తించిన భారత బౌలర్లు... టీమిండియా ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Aug 20, 2022, 3:55 PM IST
Highlights

India vs Zimbabwe 2nd ODI: రెండో వన్డేలో 161 పరుగులకి ఆలౌట్ అయిన జింబాబ్వే... మూడు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్... 

పసికూన జింబాబ్వేపై భారత బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. తొలి వన్డేలో భారత బౌలర్లకు ఎదురొడ్డి 189 పరుగులు చేసిన జింబాబ్వే బ్యాట్స్‌మెన్, రెండో వన్డేలో 38.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయ్యారు... ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహార్‌కి రెండో వన్డేలో విశ్రాంతి ఇచ్చిన టీమిండియా, అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి చోటు ఇచ్చింది. దీపక్ చాహార్ తొలి వన్డేలో 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిస్తే, రెండో వన్డేలో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు... 

ఆరంభ ఓవర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో జింబాబ్వే బ్యాటర్లు పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. సిరాజ్ రెండు మెయిడిన్ ఓవర్లు వేయగా ప్రసిద్ధ్ కృష్ణ ఓ మెయిడిన్ ఓవర్ వేశాడు. 32 బంతుల్లో 7 పరుగులు చేసి టకుజ్వానషే కైటానో, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

27 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇన్నోసెంట్ కియా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో 2 పరుగులు చేసిన జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చెక్‌బవా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 12 బంతుల్లో 2 పరుగులు చేసిన విస్లే మెదెవెరేని ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు...

మొదటి వన్డే మాదిరిగానే 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఈ దశలో సికిందర్ రజా, సీన్ విలియమ్స్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 31 బంతుల్లో 16 పరుగులు చేసిన సికందర్ రజా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత ఆరో వికెట్‌కి 33 పరుగులు జోడించిన సీన్ విలియమ్స్, 42 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి దీపక్ హుడా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన లూక్ జాంగ్వేని శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేయగా, 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన బ్రాడ్ ఇవెన్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

వికెట్ర్ నయాచి బంతులేమీ ఎదుర్కోకుండానే రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వస్తూనే బౌండరీ బాదిన తనటా చికవంగ కూడా రనౌట్ కావడంతో 161 పరుగుల వద్ద జింబాబ్వే ఇన్నింగ్స్‌కి తెరపడింది. 47 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన రియాన్ బర్ల్ నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఓ వికెట్ తీశారు. 

click me!