
భారత మహిళా సీనియర్ క్రికెటర్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్ తీసుకోబోతోంది. 39 ఏళ్ల జులన్ గోస్వామి, 2002లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసింది. 20 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న జులన్ గోస్వామి, వుమెన్స్ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరు...
2018 ఆగస్టులో టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జులన్ గోస్వామి, తన కెరీర్‌లో 12 టెస్టులు, 199 వన్డేలు, 68 టీ20 మ్యాచులు ఆడింది. వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక, మొట్టమొదటి వుమెన్స్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన జులన్ గోస్వామి, మూడు ఫార్మాట్లలో 350 వికెట్లు తీసింది.
2022 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటూ వస్తున్న జులన్ గోస్వామి, వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనబోతోంది... దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత 39 ఏళ్ల లేటు వయసులో ఎన్‌సీఏలో రీఎంట్రీ కోసం సాధన చేసింది జులన్ గోస్వామి. భారత మెన్స్ క్రికెటర్ కెఎల్ రాహుల్‌కి జులన్ గోస్వామి బౌలింగ్ చేస్తున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన జులన్ గోస్వామి, భారత మహిళా క్రికెట్ టీమ్‌కి బౌలింగ్ కన్సల్టెంట్‌గానూ సేవలు అందిస్తోంది. భారత జట్టుకి ప్లేయర్ -కోచ్‌గా ఉన్న జులన్ గోస్వామికి వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు...
సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 24 వరకూ ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది భారత మహిళా జట్టు. ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్. లార్డ్స్ మైదానంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య సెప్టెంబర్ 24న జరిగే మూడో వన్డే, జులన్ గోస్వామికి ఫేర్‌వెల్ మ్యాచ్ కానుంది...
జులన్ గోస్వామితో కలిసి ఎన్నో మ్యాచులు ఆడిన భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంది. 2022 వన్డే వరల్డ్‌లో టీమిండియా పరాజయం తర్వాత ఆమె క్రికెట్‌కి వీడ్కోలు పలికింది. అయితే జులన్ గోస్వామి మాత్రం ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో వీడ్కోలు మ్యాచ్ ఆడుతూ ఘనంగా అంతర్జాతీయ కెరీర్‌కి ముగింపు పలకనుంది...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రధాన పాత్రలో ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ మూవీ తెరకెక్కుతోంది. మిథాలీరాజ్ బయోపిక్ ‘శభాష్ మీథూ’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మిగిలినా ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’ నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ లో విడుదల కానుంది..
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కి భారత జట్టు ఇదే: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, తానియా భాటియా, యషికా భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, హర్లీన్ డియోల్, దయలన్ హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, జులన్ గోస్వామి, జెమీమా రోడ్రిగ్స్