
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండో విజయం అందుకుంది టీమిండియా. నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాని ఇన్నింగ్స్ తేడాతో చిత్తు చేసిన భారత జట్టు, ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. రెండో రోజు ఆఖరి సెషన్‌లో ఆస్ట్రేలియా ధనాధన్ ఆటతీరు చూసి, మ్యాచ్ తేడా కొడుతుందని అనుకున్న అభిమానులకు మూడో రోజు తొలి సెషన్‌లో ఆసీస్‌కి అంత సీన్ లేదని తెలిసి వచ్చింది...
మూడో రోజు ఆట ప్రారంభమైన గంటన్నరలోపే ఆస్ట్రేలియాని 113 పరుగులకి ఆలౌట్ చేసేసి నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టింది టీమిండియా. ఓపెనర్ కెఎల్ రాహుల్ వికెట్ త్వరగా కోల్పోయినా రోహిత్, విరాట్, శ్రీకర్ భరత్, పూజారా కలిసి టీమిండియాకి విజయం అందించారు..
3 బంతుల్లో 1 పరుగు చేసిన కెఎల్ రాహుల్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. లంచ్ బ్రేక్‌కి ముందే రాహుల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు..
47 టెస్టు మ్యాచులు ఆడి 80 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ, టెస్టుల్లో రనౌట్ అవ్వడం ఇదే తొలిసారి. లేని రెండో పరుగు కోసం ప్రయత్నించిన రోహిత్ శర్మ, అవతలి ఎండ్‌లో పూజారాని అవుట్ చేయడం ఇష్టం లేక తన వికెట్‌ని త్యాగం చేశాడు. 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.
ఈ దశలో ఛతేశ్వర్ పూజారాతో కలిసి మూడో వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు విరాట్ కోహ్లీ. 31 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో 25 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, 20వ శతాబ్దంలో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. కోహ్లీకి ఇది 549వ ఇన్నింగ్స్ కాగా సచిన్ టెండూల్కర్ 577 ఇన్నింగ్స్‌ల్లో, రికీ పాంటింగ్ 588 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు...
ఓవరాల్‌గా 25 వేలకు పైగా పరుగులు చేసిన ఏడో క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ (34357), రికీ పాంటింగ్ (27483), జాక్వెలిస్ కలీస్ (25534), కుమార సంగర్కర (28016), మహేళ జయవర్థనే (25957) పరుగులు చేశారు...
టామ్ ముర్పీ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన విరాట్ కోహ్లీ, స్టంపౌట్ అయ్యాడు. విరాట్ టెస్టు కెరీర్‌లో స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి.
ఆ తర్వాత 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గ టాడ్ ముర్ఫీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండో టెస్టు ఆడుతున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందాడు..
వస్తూనే దూకుడుగా ఆడిన శ్రీకర్ భరత్ 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి డ్రామా లేకుండా వార్ వన్‌సైడ్ చేసేశాడు. 74 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన పూజారా, ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించాడు.. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2 విజయాలు అందుకున్న టీమిండియా, సిరీస్‌పై పట్టు సాధించింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఓడినా, సిరీస్ డ్రా అవుతుంది కాబట్టి ట్రోఫీ టీమిండియా వద్దే ఉంటుంది..