TATA IPL: పంతం నీదా నాదా? నయా సీజన్, నయా కెప్టన్లు.. ఆరంభ వీరులయ్యేదెవరో? తొలి పోరుకు సీఎస్కే, కేకేఆర్ సిద్ధం

Published : Mar 26, 2022, 02:55 PM IST
TATA IPL: పంతం నీదా నాదా? నయా సీజన్, నయా కెప్టన్లు.. ఆరంభ వీరులయ్యేదెవరో? తొలి పోరుకు సీఎస్కే, కేకేఆర్ సిద్ధం

సారాంశం

TATA IPL2022 UPdates: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ తరుణం రానే వచ్చింది. నేటి రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. రెండు జట్లకు ఈసారి కొత్త సారథులే సారథ్యం వహించనుండటం గమనార్హం. 

ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై.. మరోవైపు గత సీజన్ లో  తుది మెట్టు మీద బోల్తా పడి కసిమీద ఉన్న కోల్కతా.. ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. రెండు జట్లలోనూ ఆటగాళ్లు కూడా మారారు.  అయితే  దుబాయ్ లో ముగిసిన జోరునే కొనసాగిస్తూ సీజన్ ను ఆరంభించాలని చెన్నై సూపర్ కింగ్స్ కోరుకుంటుంటడగా... గత సీజన్ లో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుని  ఐపీఎల్-15ను విజయంతో ప్రారంభించాలని కోల్కతా భావిస్తున్నది. మ్యాచ్ విజయావకాశాలపై ఏ జట్టు అంచనాలు దానికున్నాయి.  ఆరంభ మ్యాచ్ ద్వారా  మెగా సీజన్ కు  స్వాగతం చెప్పనున్న సీఎస్కే, కోల్కతా మ్యాచ్ నేపథ్యంలో  ఇరు జట్ల పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలుకానున్నది.

ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2021 దాకా చెన్నైని దగ్గరుండి  నడిపించిన ధోని.. మూడు రోజుల క్రితం అనూహ్యంగా ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని వాటిని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. మూడు ఫార్మాట్లలోనూ తిరుగులేని ఆల్ రౌండర్ గా మారిన జడ్డూ.. ఈసారి  ధోని మార్గనిర్దేశనంలో   నాలుగు సార్లు విజేత సీఎస్కేను ఎలా ముందుకుతీసుకెళ్తాడోనని చెన్నై అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 

అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టులో  మాత్రం అందుబాటులో ఉండటం సీఎస్కేకు లాభించేదే. దాంతో పాటు ఆ జట్టు కీలక ఆటగాడు మోయిన్ అలీ ఈ మ్యాచుకు అందుబాటులో లేడు.  అతడు ఇంకా క్వారంటైన్ లో గడుపుతున్నాడు.  అలీ తో పాటు ప్రిటోరియస్ కూడా క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఇక ఆ జట్టు కీలక ఆటగాడు, వేలంలో రూ. 14 కోట్లు పెట్టి దక్కించుకున్న దీపక్ చాహర్ గాయపడి ఇంకా ఎన్సీఏ లోనే  విశ్రాంతి తీసుకున్నాడు. ఇవి తప్ప చెన్నై కి పెద్దగా సమస్యల్లేవు. 

 

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు తోడుగా డెవాన్ కాన్వే  (న్యూజిలాండ్) ఇన్నింగ్స్ ను ఆరంభించే అవకాశముంది. అంబటి రాయుడు, జడేజా, ధోని, బ్రావోలతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. శివమ్ దూబే వంటి హిట్లర్లు కూడా ఆ జట్టు సొంతం. ఇక బౌలింగ్ లో..  ఆడమ్ మిల్నె, మహేశ్ తీక్షణ, రాజవర్ధన్ హంగర్గేకర్ లతో పేస్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది.  

ఇక కోల్కతా  విషయానికొస్తే.. గతేడాది ఆ జట్టుకు సారథిగా ఉన్న ఇయాన్ మోర్గాన్ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ను  నియమించుకుంది కేకేఆర్. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లిన అనుభవం అయ్యర్ కు ఉంది. అదీగాక స్వతహాగా అయ్యర్ కూడా ఫార్మాట్ తో సంబంధం లేకుండా భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. ఆ జట్టులో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ గతేడాది మెరుపులు మెరిపించి ఏకంగా భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆల్ రౌండర్ గా స్థానాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో వెంకటేశ్ కు ఈ ఐపీఎల్ కీలకం కానున్నది.  

 

బ్యాటింగ్ లో అతడితో పాటు నితీవ్ రాణా, సామ్ బిల్లింగ్స్, శ్రేయస్ లు  ఉన్నారు. ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లతో ఆల్ రౌండర్ల విభాగం ఉంది. టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేశ్ యాదవ్ లు పేస్ బాధ్యతలు మోయనున్నారు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథిగా  ఉన్న పాట్ కమిన్స్ ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉండటంతో అతడు  కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు.  స్పిన్ బాధ్యతలను వరుణ్ చక్రవర్తి మోయనున్నాడు. 

ఫేస్ టు ఫేస్ : ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 26 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో 17  మ్యాచులలో చెన్నై.. 8 మ్యాచుల్లో కోల్కతా గెలుపొందాయి. గత సీజన్లో మూడు సార్లు ఇరు జట్లు తలపడగా మూడింటిలో విజయం చెన్నైనే వరించింది. 

జట్లు అంచనా : 

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, ఎంఎస్ ధోని, క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, ప్రశాంత్ సోలంకి

కోల్కతా నైట్ రైడర్స్ : వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే