TATA IPL: మహారాష్ట్రలో మహా సంగ్రామం.. 4 వేదికలు 10 జట్లు.. పోరాటానికి యోధులు సిద్ధం.. ఇక యుద్ధమే తరువాయి..

Published : Mar 25, 2022, 09:09 PM ISTUpdated : Mar 26, 2022, 07:55 AM IST
TATA IPL: మహారాష్ట్రలో మహా సంగ్రామం.. 4 వేదికలు 10 జట్లు..  పోరాటానికి యోధులు సిద్ధం.. ఇక యుద్ధమే తరువాయి..

సారాంశం

IPL 2022 Live Updates: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అరవై రోజుల పాటు పది జట్లు నాలుగు స్టేడియాల్లో కొదమసింహాల్లా పోరాడే క్రికెట్ పండుగకు వేళైంది. మార్చి 26 సాయంత్రం 7.30 గంటలకు ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానున్నది.

చరిత్రకెక్కిన పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ  ఏలిన గడ్డ మహారాష్ట్ర.  దేశ చరిత్రను మలుపుతిప్పిన  పోరాటాలెన్నో ఇక్కడే పురుడు పోసుకున్నాయి. ఇప్పుడు అదే గడ్డపై ఏకంగా  అరవై రోజుల పాటు పోరాడేందుకు వివిధ దేశాల క్రికెట్ యోధులు సిద్ధమవుతున్నారు. అయితే ఈ  యుద్ధంలో కత్తులు, కటార్లు, బడిసెలు ఉండవు.  వాటి స్థానాన్ని బ్యాట్లు, బంతులు ఆక్రమించబోతున్నాయి. రక్తపాతం మచ్చుకైనా కనిపించదు.  ఆ స్థానే పరుగులు వరదలై పారుతాయి.  ఓడితే రాజ్యాలు కూలవు.. సదరు జట్లు పాయింట్ల పట్టికలో చిట్ట చివరికి చేరతాయి. కత్తిపోట్లు,  వెన్నుపోట్లు ఉండవు.. ఏదున్నా ముఖాముఖి తలపడటమే. అది ఆటైనా, మాటల తూటాలైనా.. యుద్ధంలో గెలిస్తే అక్కడ రాజ్యం దక్కుతుంది. ఇక్కడ మాత్రం కోటానుకోట్ల ప్రైజ్ మనీ దక్కుతుంది.  మార్చి 26న మొదలై మే 29న ముగియనున్న ఈ మహా సంగ్రామానికి సంబంధించిన  వివరాలు ఇవిగో.. 

దేశవ్యాప్తంగానే గాక ప్రపంచంలో  క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మార్చి 26 (శనివారం) నుంచి దేశ ఆర్థిక రాజధానిలోని ప్రముఖ వాంఖెడే  ప్టేడియం వేదికగా ఐపీఎల్ - 2022 సీజన్ ప్రారంభం కాబోతున్నది. తమ అభిమాన ఆటగాళ్ల మెరుపులు చూడటానికి క్రికెట్ ఫ్యాన్స్ అంతా కళ్లల్లో వత్తులేసుకుని చూస్తున్నారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానున్నది. 

పది జట్లు.. ఐదు వేదికలు.. 

ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు చేరిన విషయం తెలిసిందే. వీటి రాకతో గతంలో 8గా ఉన్న ఫ్రాంచైజీలు ఇప్పుడు పదికి చేరాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ కు తోడుగా ఇప్పుడు  లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా చేరాయి. ఈ పది జట్లు మహారాష్ట్రలోని వాంఖెడే స్టేడియం, డీవై పాటిల్, బ్రబోర్న్ (ముంబై) లతో పాటు పూణెలోని ఎంసీఎ స్టేడియంలో 70 మ్యాచులు ఆడనున్నాయి. ముంబైలో 55, పూణెలో 15 మ్యాచులు జరుగుతాయి.

 

రెండు గ్రూపులు : 

ఈ ఐపీఎల్ కోసం కొత్త ఫార్మాట్ ను అమలుచేయబోతున్నారు. ఈ ఏడాది జట్ల సంఖ్య పెరగడంతో పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.  గ్రూప్ -ఏలో ముంబై ఇండియన్స్,  కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గ్రూప్-బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఎప్పటిలాగే  ప్రతి జట్టు 14 మ్యాచులు ఆడుతుంది. అయితే అదే గ్రూపులో ఉన్న మిగతా జట్లతో రెండేసి మ్యాచులు, మరో గ్రూప్ లోని జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది.

కఠిన నిబంధనలు : 

కరోనా నేపథ్యంలో  పూర్తిగా బయో బబుల్ లో జరుగబోతున్న ఈ సీజన్ లో కఠిన నిబంధనలు విధించింది బీసీసీఐ. బబుల్ నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన శిక్షలు విధించనుంది.  ఆటగాడికైతే  హెచ్చరికలు, వేటు ఉండగా ఫ్రాంచైజీకి కోటి రూపాయల జరిమానా విధించనుంది. ఆటగాళ్లతో పాటు వాళ్లతో  వచ్చే కుటుంబ సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహాయక బృందం కూడా  బబుల్ నిబంధనలు కచ్చితంగా  పాటించాలి.  

కొత్త రూల్స్ : 

ఈ ఏడాది ఐపీఎల్ లో  బీసీసీఐ పలు  చట్టాలలో మార్పులు చేసింది. ఏదైనా జట్టులోని సభ్యులు కరోనా బారిన పడి,  మ్యాచుకు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో లేకుంటే బీసీసీఐ ఆ మ్యాచును రీషెడ్యూల్ చేస్తుంది. అదీ సాధ్యం కాకుంటే ఐపీఎల్ సాంకేతిక కమిటీకి సూచిస్తుంది.  ఆ కమిటీనే మ్యాచ్ నిర్వహణ పై తుది  నిర్ణయం తీసుకుంటుంది. ఇక డీఆర్ఎస్ విషయంలో కూడా నియమావళి మార్చింది. ప్రతి ఇన్నింగ్స్ లో  ఒక్కో జట్టు ఒక్కో సమీక్ష కోరే  వీలు మాత్రమే ఉండేది. కానీ దాన్ని ఇప్పుడు రెండుకు పెంచారు. ఇక ఎంసీసీ తాజాగా తీసుకొచ్చిన నాన్ స్ట్రైకింగ్ (క్యాచ్ అవుట్ అయ్యాక వచ్చే బ్యాటర్ స్ట్రైకింగ్ కు రావడం) నిబంధనను కూడా అమలు చేస్తున్నది. 

 

కొత్త సారథులు : 

ఈ ఐపీఎల్ లో ఆరు జట్లకు కొత్త సారథులు వచ్చారు. వారే ఆర్సీబీకి డుప్లెసిస్. సీఎస్కేకు రవీంద్ర జడేజా. కేకేఆర్ కు శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కు మయాంక్ అగర్వాల్. లక్నోకు కెఎల్ రాహుల్. గుజరాత్ కు హార్థిక్ పాండ్యా.  కెప్టెన్లుగా వారి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి తద్వారా భారత జట్టులో వారి స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఈ ఐపీఎల్ ఒక మంచి వేదిక.  ఐపీఎల్ లో సుదీర్ఘకాలం కెప్టెన్లుగా పనిచేసిన ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలు ఈసారి  వారి జట్లకు సారథులుగా  వ్యవహరించడం లేదు. 

ధోనికి లాస్ట్ సీజన్..? 

2008 నుంచి 2021 దాకా చెన్నైకి  సారథిగా  వ్యవహరించిన మహేంద్రుడు ఈ సీజన్ లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.  అదీ గాక ఈ సీజన్ లో అతడు ఆడేది కూడా అనుమానంగానే ఉంది. దీనిపై కూడా స్పష్టత లేదు. ఇదిలాఉంటే వయసు మీద పడుతుండటం, యువతరాన్ని ప్రోత్సహించేందుకు గాను ధోని ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

25 శాతం మందికి అవకాశం.. 

తాజా సీజన్ కోసం స్టేడియాల్లోకి 25 శాతం మంది ప్రేక్షకులన అనుమతించనున్నారు. 2021 సీజన్ లో కూడా 25 శాతం మందితో మ్యాచులు జరిపించినా  మధ్యలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో సీజన్ ను అర్థాంతరంగా నిలిపేశారు. తిరిగి సెప్టెంబర్ లో దుబాయ్ వేదికగా రెండో దశను జరిపించారు. 

ఎలా చూడొచ్చు...? 

ఐపీఎల్ ను బీసీసీఐ అధికారిక  ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ 8 భాషల్లో 24 నెట్వర్క్ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నది.  హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు ఈ సారి మళయాళం, మరాఠీ, బెంగాళీ లలో కూడా ఐపీఎల్ ప్రసారాలు ఉంటాయి. (డిస్నీ హాట్ స్టార్ లో గుజరాతీ కామెంట్రీ కూడా వినొచ్చు). ఇందుకోసం 80 మందితో కూడిన కామెంట్రీ టీమ్ సిద్ధంగా ఉంది.

ఇండియాలో ఉన్నవాళ్లైతే స్టార్ నెట్వర్క్ తో పాటు డిస్నీ హాట్ స్టార్, జియో టీవీ, ఎయిర్టెల్ లో మ్యాచులను వీక్షించొచ్చు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే