
ఐపీఎల్-2022 సీజన్ ను చెన్నై, ముంబై మాదిరే ఓటమితో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తమ తొలి మ్యాచ్ కు సంబంధించిన ఓ విషయంపై నిరసన గళమెత్తింది. మార్చి 29న ఎస్ఆర్హెచ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచులో హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ ఔట్ కు సంబంధించిన పంచాయతీని బీసీసీఐ వద్దే తేల్చుకోవాలని ఫిక్స్ అయింది. కేన్ విలిమయ్సన్ ఇచ్చిన క్యాచ్ ను దేవదత్ పడిక్కల్ పట్టిన తీరు, దానిపై థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బీసీసీఐ వద్దే పంచాయతీని తేల్చుకోవాలని నిర్ణయించింది.
రాజస్థాన్ తో మ్యాచులో ఆ జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (211) ఛేదించే క్రమంలో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్లో కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడ్డట్టే పడి మిస్ అయింది. బంతి కింద పడుతున్న దశలో స్లిప్స్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ ఆ క్యాచ్ ను అందుకున్నాడు. అయితే పడిక్కల్ చేతిలో పడేదానికంటే ముందే బంతి గ్రౌండ్ కు తాకినట్టు టీవీ రిప్లేలో స్పష్టంగా కనిపించింది.
బంతి గ్రౌండ్ తాకినా థర్డ్ అంపైర్ మాత్రం దానిని ఔట్ ఇచ్చాడు. దీంతో ఈ నిర్ణయం వివాదానికి తెరతీసింది. ఇక తాజాగా ఇదే విషయమై ఎస్ఆర్హెచ్ నిరసన గళమెత్తింది. ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాషి తమ అభ్యంతరాన్ని తెలిపింది. కేన్ మామ ఔట్ కు సంబంధించిన వీడియో క్లిప్స్, బంతి గ్రౌండ్ ను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్న ఫోటోలను లేఖలో జత చేసింది.
తాము థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని లేఖలో ఎస్ఆర్హెచ్ స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరింది. విలియమ్సన్ వివాదాస్పద క్యాచ్ ను ఔట్ గా ప్రకటించిన థర్డ్ అంపైర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. కుదిరితే ఇటువంటి వివాదాస్పద క్యాచ్ ల పై నిర్ణయాలు తీసుకునే విషయంలో నిబంధనలను కూడా సవరించాలని కోరింది. బంతి ఇప్పుడు బీసీసీఐ కోర్టులో ఉంది. మరి దీనిపై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చింది ఆ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేయగలిగింది. పలితంగా 61 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. ఈ సీజన్ లో టాస్ గెలిచినా ఓడిన జట్టు ఏదైనా ఉందంటే (ఇప్పటివరకు) అది హైదరాబాదే..