IPL2022: తొలిదెబ్బ తిన్న పులులు పోరాటానికొచ్చిన వేళ.. మళ్లీ టాస్ ఓడిన చెన్నై.. ఈ మ్యాచ్ కూడా...?

Published : Mar 31, 2022, 07:10 PM IST
IPL2022: తొలిదెబ్బ తిన్న పులులు పోరాటానికొచ్చిన వేళ.. మళ్లీ టాస్ ఓడిన చెన్నై.. ఈ మ్యాచ్ కూడా...?

సారాంశం

TATA IPL 2022 - CSK vs LSG:  ఐపీఎల్ లో తమ తొలి మ్యాచులలో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ - లక్నో సూపర్ జెయింట్స్  సీజన్ లో తొలిసారిగా తలపడుతున్నాయి.   ఈ మ్యాచులో విజయం సాధించి తద్వారా బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.  

ఓ జట్టేమో నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేత.  9 సార్లు ఫైనల్ కు చేరింది. గత సీజన్ లో విజేత డిఫెండింగ్ ఛాంపియన్ అనే ట్యాగ్ తో బరిలోకి దిగింది.  కొత్త సీజన్.. కొత్త కెప్టెన్  సారథ్యంలో ఘనంగా ఆరంభిద్దామనుకున్న  ప్రణాళిక కాస్తా బెడిసికొట్టింది. గత సీజన్ లో రన్నరప్ చేతిలో ఆ జట్టుకు దారుణ పరాభవం.  మరోవైపు  ఐపీఎల్ లో ‘కోట్లాది’ ఆశలతో అరంగేట్రం చేసి  విజయంతో లీగ్ ను ప్రారంభిద్దామనుకున్న జట్టుకు అనూహ్య పరాజయం. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లున్నా  ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఈ రెండు జట్లు  తొలిదెబ్బ తిన్న పులుల్లా కొట్లాడటానికి వచ్చాయి.  ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా తలపడుతున్న ఈ  మ్యాచులో టాస్ గెలిచిన కెఎల్ రాహుల్  సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్   ముందు బౌలింగ్ ఎంచుకుంది.  రవీంద్ర జడేజా  నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కు రానుంది. 

తొలి మ్యాచులో కేకేఆర్ తో ఓడిన సీఎస్కే.. గుజరాత్ చేతిలో ఓడిన లక్నో లు బ్రబోర్న్ లో ఢీకొనబోతున్నాయి.  ఓపెనింగ్ మ్యాచులో ఓటమికి శుభం కార్డు పలికి విజయ బోణీ కొట్టాలని రెండు జట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.  మరి టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే అన్న సూత్రం ఫాలో అవుతున్న  ఐపీఎల్ కెప్టెన్ల ప్రకారం చూస్తే.. ఈ పోరులో విజేత లక్నో నేనా..?  

బలబలాలు : 

చెన్నై సూపర్ కింగ్స్  ప్రధాన బ్యాటర్లంతా కేకేఆర్ మ్యాచులో తేలిపోయారు. గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్.. ఆ మ్యచులో డకౌట్ కాగా..  కాన్వే, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివం దూబే లు ఆకట్టుకోలేదు. వీళ్లందరి నుంచి భారీ ఇన్నింగ్స్ రావాలని  సీఎస్కే అభిమానులు భావిస్తున్నారు.  గత మ్యాచులో  మాజీ సారథి ధోని  తొలుత నింపాదిగా ఆడినా తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఇది సీఎస్కేకు ఉత్సాహాన్నిచ్చేదే. అయితే ఈ మ్యాచులో ఆ జట్టు ఆల్ రౌండర్ మోయిన్ అలీ కూడా ఆడనుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.   ఈ మ్యాచుకు చెన్నై 3 మార్పులు చేసింది.  మోయిన్ అలీ తో పాటు ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి జట్టుతో చేరారు. డెవాన్ కాన్వే, ఆడమ్ మిల్నే లు ఆడటం లేదు. 

ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్ పాండే లు పెద్దగా ఆకట్టుకోకపోయినా డ్వేన్ బ్రావో మాత్రం రాణించాడు.  ఆల్ రౌండర్ ట్యాగ్ ఉన్న రవీంద్ర జడేజా, శివమ్ దూబే లు రెండు విభాగాల్లో విఫలమయ్యారు.   ఈ  మ్యాచులో  అయినా వీళ్లు రాణించాలని చెన్నై భావిస్తున్నది. 

ఇక లక్నో  వైపు చూస్తే.. రూ. 17 కోట్లు పెట్టి దక్కించుకున్న ఆ జట్టు సారథి కెఎల్ రాహుల్ గుజరాత్ తో మ్యాచులో డకౌట్ అయి నిరాశపరిచాడు. మనీష్ పాండే, ఎవిన్ లూయిస్ కూడా  విఫలమయ్యారు. క్వింటన్ డికాక్ సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మిడిలార్డర్ లో దీపక్ హుడా, యువ ఆటగాడు ఆయుష్ బదొని లు ధాటిగా ఆడారు.   బౌలింగ్ లో ఆ జట్టు  అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర ల మీదే ఆశలు పెట్టుకుంది. 

- ఈ మ్యాచులో 15 పరుగులు చేస్తే ధోని టీ20 ఫార్మాట్ లో 7వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాటర్ అవుతాడు. 
- ఒక వికెట్ తీస్తే  ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా డ్వేన్ బ్రావో   కొత్త చరిత్ర లిఖిస్తాడు. ప్రస్తుతం అతడు లసిత్ మలింగ (170 వికెట్లు) రికార్డును సమం చేశాడు. 

తుది జట్లు : 

చెన్నై సూపర్ కింగ్స్ :  రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప,  మోయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), ఎంఎస్ ధోని, శివం దూబే, డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి,  తుషార్ దేష్పాండే

లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదొని, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, ఆండ్రూ టై, అవేశ్ ఖాన్ 

PREV
click me!

Recommended Stories

IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్
Rohit Sharma : ఊచకోత అంటే ఇదే.. రోహిత్ దెబ్బకు రికార్డులు అబ్బో !