
ఖలీల్ అహ్మద్.. ఎక్కడో తెలిసిన పేరులా కనిపిస్తుంది కదా.. అయితే ఆశ్చర్యపోకండి.. గతంలో నాలుగు సీజన్ల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ఈ యువ బౌలర్.. రాబోయే 10-12 ఏండ్లలో భారత జట్టులో కీలక బౌలర్ గా ఎదుగుతానని అంటున్నాడు. గతంతో పోలిస్తే తన బౌలింగ్ రాటుదేలిందని, అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టేందుకు ఐపీఎల్ ను చక్కగా వినియోగించుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఖలీల్.. ఈ సీజన్ లో తమ జట్టు ట్రోపీ విజేతగా నిలుస్తుందని, రిషభ్ పంత్ ప్రతిభావంతుడైన సారథి అని కొనియాడాడు.
ఏప్రిల్ 2న ఢిల్లీ.. గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడుతున్న నేపథ్యంలో ఖలీల్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. అతడు మాట్లాడుతూ... ‘గతంలో ఎప్పుడూ లేనంతగా నేను నా బౌలింగ్ పై దృష్టి సారించాను. రెడ్, వైట్ బాల్ క్రికెట్ లో బాగా రాణించేందుకు నేను సిద్ధమవుతున్నాను. ఇప్పుడు నిలకడగా 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాను. అంతేగాక స్వింగ్ బౌలింగ్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచాను.
నాకు తెలిసి వచ్చే పది, పన్నెండేండ్ల పాటు భారత జాతీయ జట్టుకు నేను సేవ చేస్తానని భావిస్తున్నాను. నేనెక్కడ ఉంటానో నేను ఊహించగలను. అందుకు నేను పూర్తిస్థాయిలో సన్నద్ధుడిగానే ఉన్నాను. ఈ ఐపీఎల్ లో మీరు డిఫరెంట్ ఖలీల్ ను చూస్తారు. అందులో నాదీ గ్యారెంటీ..’అని వ్యాఖ్యానించాడు.
ఇదిలాఉండగా.. 24 ఏండ్ల ఈ యువ రాజస్థాన్ పేసర్ 2016లో అండర్-19 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున ఆడాడు. 2018లో భారత్.. హాంకాంగ్ తో ఆడిన మ్యాచులో సభ్యుడిగా ఉన్నాడు. 2019 నవంబర్ నుంచి అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. అంతర్జాతీయ స్థాయిలో 11 వన్డేలు, 14 టీ20 లు ఆడిన ఖలీల్.. వన్డేలలో 15, టీ20 లలో 13 వికెట్లు తీసుకున్నాడు. కాగా, ఇటీవలే ముగిసిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ. 5.25 కోట్లు పోసి కొనుగోలు చేసింది. ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో ఖలీల్.. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ వికెట్లను పడగొట్టాడు. నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
టైటిల్ మాదే..
ఐపీఎల్ - 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్ ను సాధిస్తుందని ఖలీల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఢిల్లీకి తొలి టైటిల్ అందించే సత్తా పంత్ కు ఉందని చెప్పాడు. రిషభ్ అద్భుతమైన కెప్టెన్. నేను అతడితో కలిసి అండర్-19 ప్రపంచకప్ ఆడానని చెప్పుకొచ్చాడు. పంత్ గురుంచి తనకు తెలుసని, అతనితో ఆటకు సంబంధించిన ప్లాన్స్‌ను చర్చించవచ్చని.. మళ్లీ అతడితో కలిసి ఆడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని ఖలీల్ తెలిపాడు.